ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవసరాన్ని మించి విదేశీ యాత్రలు చేస్తూ వాస్తవ సమస్యలు వాయిదా వేస్తున్నారనే విమర్శ తరచూ వినిపిస్తుంటుంది. దేశంలోని సీనియర్ సంపాదకులలోఒకరుగానే గాక జాతీయ రాజకీయాలలో కూడా అనుభవజ్ఞుడైన ప్రభుచావ్లా ఇప్పుడు దీన్ని సోదాహరణంగా విమర్శించారు. విశేషమైన పాలనానుభవం కలిగిన చంద్రబాబు ఈ స్థాయిలో ఎందుకు తిరుగుతున్నారు? సింగపూర్‌కు మాత్రమే గాక జపాన్‌కు కూడా రెండుసార్లు వెళ్లివచ్చారు.
అగ్రదేశాల నేతలు హాయిగా సేదదీరేందుకు మాత్రమే ఉపయోగించే దావోస్ ఆర్థిక శిఖరాగ్రసభకు ఎక్కడ లేని ప్రాధాన్యతనిచ్చి తీరికలేని చర్చలు పవర్‌పాయింట్ ప్రెజంటేషన్లు చేశారు. ఇక ఢిల్లీకి 23 సార్లు పర్యటించి 27 రోజులు గడిపారని లెక్కలు చెప్పారు. చంద్రబాబును మినహాయిస్తే కాంగ్రెసేతర ముఖ్యమంత్రులెవరూ మమతా బెనర్జీ, జయలలిత వంటివారెవరూ ఇన్ని సార్లు చక్కర్లుకొట్టలేదని ఆయన వ్యాఖ్యానించారు.
1996 నాటికి ఢిల్లీలో ‘కింగ్‌మేకర్’గా వున్న చంద్రబాబు స్థానం ఇప్పుడు బలహీనపడినందునే ప్రత్యేక హోదాతో సహా ఏదీ తెచ్చుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. ఆర్థిక సమస్యలనుంచి బయిటపడేందుకు ఇదంతా చేస్తున్నట్టు చంద్రబాబు చెబుతున్నా స్వరాష్ట్రంలో చేయవలసింది వెనక్కుపోయి పర్యటనలతో సమయం హరించుకుపోతున్నదని ఆయన పార్టీవారు కూడా అసంతృప్తిగా వున్నారని ప్రభుచావ్లా రాశారు. ఇన్నిపర్యటనల తర్వాత కూడా తాత్కాలిక రాజధాని నిర్మాణానికి ఎవరూ ముందుకురాని పరిస్థితి చూస్తే చావ్లా వంటివారి వ్యాఖ్యలు వాస్తవమేననిపిస్తాయి. అదే మాట తెలుగువాళ్లు అంటే ఎంతగానో ఆగ్రహించి తనెంత కష్టపడుతున్నదీ ఏకరువు పెట్టే చంద్రబాబు ఈ సీనియర్ సంపాదకుడి మాటైనా ఆలకిస్తారా?