చిరంజీవి 150వ సినిమా ఓ డాన్స్ మేళాగా మారబోతోంది. చిరు తన స్టెప్పుల్లో పదును తగ్గలేదని నిరూపించుకోవడానికి తహతహలాడిపోతుండడమే అందుకు నిదర్శనం. ఈ సినిమా కోసం ఓ పాట కంపోజ్ చేయమని లారెన్స్‌కి కబురెట్టినచిరంజీవి… ఇప్పుడు ప్రభుదేవానీ పిలిపించాడు. చిరంజీవి – వినాయక్ కాంబినేషన్లో కత్తి సినిమా రీమేక్ రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. చిరు సినిమా కోసం ప్రభుదేవా ఓ పాట కంపోజ్ చేసే పనిలో ఉన్నాడు. ఇటీవల చిరంజీవిని కలుసుకొన్న ప్రభుదేవా ఆ పాట గురించి మెగాస్టార్‌తోనూ, దేవిశ్రీ ప్రసాద్‌తోనూ చర్చించాడు.
ప్రభుదేవా దర్శకుడయ్యాక బయటి సినిమాలకు కంపోజ్ చేయడం బాగా తగ్గించాడు. అయితే ఇటీవల ఓ సందర్భంలో ”చిరు పిలిస్తే.. తప్పకుండా 150వ సినిమాకి ఓ పాట కంపోజ్ చేస్తా” అన్నాడు. అలా.. ఇప్పుడు చిరు పిలుపు అందుకొన్నాడు. ఈ పాట కోసం ముందస్తు రిహార్సల్స్ చేయాల్సివస్తోందట. అందుకోసం చిరు మూడు రోజుల సమయం కేటాయించినట్టు తెలుస్తోంది. ప్రభుదేవా – చిరంజీవి కలయిలో ఎన్నో సూపర్ హిట్ గీతాలొచ్చాయి. మరి ఈ రీ ఎంట్రీ సినిమాలో స్టెప్పులు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.