ఇప్పుడు ఇండియా లో అన్ని సినీ పరిశ్రమల్లో బయోపిక్ ల సీజన్ నడుస్తోంది. బాలీవుడ్ లో కొన్నేళ్ళ క్రితం మొదలై, అన్ని పరిశ్రమలకీ పాకింది. అయితే ఆ మధ్య రాజమౌళి మహా భారతం తీస్తానని అనడమూ, ఆ తర్వాత అల్లు అరవింద్ తానూ అలాంటి సినిమా తీస్తాననడమూ, ఈలోగా మోహన్ లాల్ నుంచి కూడా అలాంటి సినిమా ని ప్రకటించడం తో ఇక పౌరణికాల జోరు మొదలవుతుందని అంతా అనుకున్నప్పటికీ, పౌరాణికాలు తీయాలంటే ఎక్కువ బడ్జెట్ అవసరమవడం వల్లో, మరే కారణాల వల్లో ఆ ట్రెండ్ మొదలవలేదు. అయితే ఇప్పుడు మరొక ప్రకటన అలాంటిది వచ్చింది. ఈ సారి ప్రకటించింది – ప్రభుదేవా.
నటుడు, దర్శకుడు ప్రభుదేవా మీడియా మాట్లాడుతూ, రామాయణం తెరకెక్కించాలని ఉందని అన్నారు. హాలీవుడ్ సినిమా ‘ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్’ తరహాలో తీయాలని ఉందని చెప్పాడు. అయితే ఇప్పుడే కాదని చెప్పాడు. ఆ సినిమాకు ఎంత లేదన్నా రూ.500 కోట్ల నుంచి రూ .600 కోట్ల బడ్జెట్ అవుతుందని పేర్కొన్నారు. ఆ బడ్జెట్ కు మన సినిమాలు చేరాలంటే ఐదేళ్లు పడుతుందని వెల్లడించారు. అప్పుడు రామాయణాన్ని తెరకెక్కిస్తానని ప్రభుదేవా తెలిపాడు.
మరి ఇదైనా తెరమీదకి వస్తుందా లేక మిగతా వాటిలాగా ప్రకటనకి పరిమితమవుతుందా వేచి చూడాలి.