అక్రమ కట్టడంగా గుర్తించి… ఏపీ సర్కార్ కూల్చివేసిన ప్రజావేదిక నిర్మాణ వ్యయంపై… విస్త్రతంగా చర్చ జరుగుతోంది. రూ. ఎనిమిదిన్నర కోట్లు ఖర్చుపెట్టాలని ముఖ్యమంత్రి, మంత్రులు ఆరోపించారు. మొదట రూ. ఐదు కోట్లకు… అంచనాలు వేసుకుని ఆ తర్వాత దాన్ని రూ. ఎనిమిదిన్నర కోట్లకు తీసుకెళ్లారని.. స్వయంగా జగన్మోహన్ రెడ్డి కూడా ప్రకటించారు. అందుకే.. దాన్ని అక్రమ కట్టడంతో పాటు… అవినీతి భవనమని కూడా.. కలెక్టర్ల సమావేశంలో వ్యాఖ్యానించారు. దీనిపై టీడీపీ నేతలెవరూ పెద్దగా మాట్లాడలేదు.
రూ. 90 లక్షలు.. రూ. ఎనిమిదిన్నర కోట్లెలా అయింది..?
అయితే హఠాత్తుగా.. ప్రజావేదిక నిర్మాణ వ్యయం రూ. 90 లక్షలేనంటూ.. అప్పట్లో విడుదల చేసిన ఓ జీవో.. బయటకు వచ్చింది. ప్రజావేదికతో పాటు… సీఎం ఇంటి చుట్టూ.. కొన్ని పోలీస్ అవుట్ పోస్టులు.. పార్కింగ్ స్థలం ఏర్పాటు.. వంటి వాటికి కలిపి.. నిధులు విడుదల చేసిన జీవో… బయటకు వచ్చింది. 2017లో విడుదల చేసిన ఈ జీవోలో ప్రజావేదిక నిర్మాణానికి అయిన ఖర్చు రూ. 90 లక్షలు అని మాత్రమే చెప్పారు. మరి రూ. ఐదు కోట్ల రూపాయలు అంచనాలు.. దాన్ని రూ. ఎనిమిదిన్నర కోట్లకు పెంచడం ఏమిటో చాలా మందికి అర్థం కాలేదు. ప్రభుత్వ వర్గాలు కూడా… గత ప్రభుత్వంపై ఇలాంటి ఆరోపణలు చేయడం కంటే.. జీవోలు విడుదల చేస్తే.. బాగుండేదన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతోంది. అంచనాలు పెంపు జీవోలుంటే విడుదల చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం.. వైసీపీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది.
ఫర్నీచర్ సహా ఇతర ఆస్తులు ఆ ఖాతాలో ఉన్నాయా..?
అయితే నిర్మాణ రంగ ప్రముఖులు మాత్రం… ఒక్క ప్రజావేదిక నిర్మాణం… ఫిజికల్‌గా.. అంటే… ఆ కట్టడానికి గోడలు.. స్టీల్, ఫ్లోరింగ్.. ఎలాంటి ఇంటీరియర్ .. మౌలిక సదుపాయాలు లేకుండా… నిర్మించడానికి అయ్యే వ్యయం రూ. 90 లక్షలని చెబుతున్నారు. అంతే… ఖర్చయిందని.. మిగతా..మొత్తం మౌలిక సదుపాయల కోసం ఖర్చు చేసి ఉంటారని చెబుతున్నారు. ఫర్నీచర్ సహా.. ఏసీలు.. ఇతర అధికార కార్యక్రమాల నిర్వహణం కోసం అవసరమైన సామాగ్రి ఇలా.. మొత్తం వ్యయం కలిపి ప్రభుత్వం చెబుతున్నంత అయి ఉంటుందని అంటున్నారు. కూల్చి వేతతో.. వాటికి వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే.. వాటన్నింటినీ.. ప్రభుత్వం జాగ్రత్తగా తరలించేసింది.
మంత్రుల రూ. కోటి నష్టం కామెంట్ల వెనుక అసలు కథ ఇదేనా..?
ప్రజావేదిక కూల్చివేత వల్ల.. రూ. పది కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని వస్తున్న విమర్శలను కాచుకునేందుకు… మంత్రులు… కొత్త వాదన వినిపించారు. కూల్చివేత వల్ల కేవలం రూ. కోటి మాత్రమే నష్టం వస్తుందని వాదించారు. ఆ రూ. కోటి వాదనల్లో అసలు నిజం ఇదేనని… భావిస్తున్నారు. మొత్తానికి ప్రజావేదిక నిర్మాణ వ్యయం… కూల్చివేత వ్యయం.. జరిగిన నష్టంపై… ప్రభుత్వమే అధికారిక ప్రకటన చేసే వరకూ.. ఈ చర్చలు సాగుతూనే ఉంటాయి.