ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా.. ఈనెల 11న ఓట్ల లెక్కింపులో తమ ప్రభుత్వం రావడం ఖాయమని ప్రజాకూటమి నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజాకూటమి 70 నుంచి 80 స్థానాల్లో గెలుస్తుందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇండియా టుడే చానల్ లో 90సీట్లు వస్తాయన్న ఎగ్జిట్ పోల్ విషయంపై.. తనకే నమ్మకం లేదని.. ఆ చానల్ ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయ్ తనకు నేరుగా ఫోన్ చేసి చెప్పారంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ తనకు ఫోన్ చేశారని.. తమ ఎగ్జిట్ పోల్ చూసి కంగారు పడొద్దని చెప్పారన్నారు. తమ ఎగ్జిట్ పోల్‌పై వాళ్లకే నమ్మకం లేదని అన్నారన్నారు. పోటాపోటీగా ఉండబోతుందని చెప్పారన్నారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ అలాగే ఉంటాయన్నారు.
కేసీఆర్ కుటుంబంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఉత్తమ్ తేల్చారు. 12వ తేదీన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈవీఎంల రవాణా, భద్రతపై ఫోన్లు వస్తున్నాయని .. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని… ప్రజాకూటమి నేతలకు పిలుపునిచ్చారు. అనేక విషయాల్లో ఎన్నికల సంఘం విఫలమైందని మండిపడ్డారు.తాళం వేశాక స్ట్రాంగ్ రూములలోకి అధికారులు కూడా వెళ్ల కూడదన్నారు. కేసీఆర్ దురుద్దేశంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లారని టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మండిపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకుని .. పెద్ద ఎత్తున ధనాన్ని సమకూర్చుకొని కేసీఆర్ ఎన్నికలకు వెళ్లారన్నారు. కేసీఆర్ కోట్లు పంచినా ఓటర్లను ప్రభావితం చేయలేకపోయారన్నారు.
తెలంగాణలో ప్రజల మనుగడ కోసం కాంగ్రెస్‌తో కలిశామన్నారు రమణ. ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదని తాము.. కామన్ మినిమం ప్రోగ్రామ్‌తో ప్రజల్లోకి వెళ్లామని.. ప్రజాకూటమిని ప్రజలు ఆదరించారన్నారు. 2014 కంటే ఓటింగ్ శాతం మరింత పెరిగిందని .. కొత్త ప్రభుత్వం రావాలని అందరూ కోరుకుంటున్నారన్నారు. ఒక్క లగడపాటి రాజగోపాల్ చెప్పిన ఎగ్జిట్ పోల్ మాత్రమే అనుకూలంగా వచ్చినా.. ఎన్నికలు మాత్రం ఏకపక్షంగా జరగలేదన్న అభిప్రాయం అంతటా వినిపిస్తోంది. అదే విశ్వాసాన్ని కూటమి నేతలు వెల్లడించారు.