ప్రకాశం జిల్లాలో వైసీపీ పరిస్థితి ఘోరంగా మారింది. జగన్ రెడ్డి బంధువులు బాలినేని, వైవీ సుబ్బారెడ్డి వర్గపోరాటంలో పార్టీని చీలికలు, పేలికలు చేసేశారు. జగన్ రెడ్డి కూడా కొన్నాళ్లు ఒకరి వైపు.. కొన్నాళ్లు మరొకరి వైపు ఉన్నారు. దీంతో ఆ ఇద్దరిలో ఒకరు రగిలిపోతున్నారు. ఆయన వర్గం అంతా.. కసితో ఉంది. జిల్లా పార్టీ పగ్గాలు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అప్పగిస్తున్నట్లు వైసిపి కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి గతంలో ప్రకటించారు. అదిపేరుకే .. కానీ ఇన్‌ఛార్జిల మార్పుల వ్యవహారంలో ఆయనకు కనీస సమాచారం లేదు.ఆయా నియోజకవర్గాల్లో బాలినేని వర్గం బలంగా ఉంది.
కొత్తగా నియమితులైన ఇన్‌ఛార్జిలు నియోజకవర్గా లకు వెళ్లలేకపోతున్నారు. వర్గపోరు కూడా తీవ్రమవుతోంది. చేపట్టే మార్పులపై ముందుగా కనీసం జిల్లా నేతలతోనూ మంతనాలు జరిపిన దాఖలాల్లేవు. జిల్లాలో ముఖ్యనేతలుగా ఉన్న ఒకరిద్దరినైనా పిలిచి చర్చించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ మార్పులపై బాలినేని కూడా అంతర్మథనంగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. నియోజకవర్గాల్లో అంతర్గత సంక్షోభాలు తెరపైకి వచ్చాయి. ఇప్పటివరకూ పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కనపెట్టడంపై భగ్గుమంటున్నారు. ఎన్నికల నాటికి ఇవి కొత్త సవాళ్లుగా మారతాయనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. బాలినేని చెప్పకుండా తామేమీ నిర్ణయం తీసుకోలేమని కొందరు మండల నేతలు బహిరంగంగానే చెబుతున్నారు.
అభ్యర్థుల ఎంపిక, మార్పులలో తన పాత్ర లేనందున మాజీ మంత్రి బాలినేని కూడా అధిష్టానంపై అసంతృప్తిగానే ఉన్నారు. దీంతో ఆయనపైనా రాజకీయంగా పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గిద్దలూరులో పోటీచేయాలని అక్కడ బలమైన సామాజికవర్గ నేతలు బాలినేనిని అడుగుతున్నారు. ఇది కూడా చర్చలోకి వచ్చింది. జిల్లా నేతలతో చర్చించకుండా ఏకపక్షంగా అధిష్టానం తీసుకున్న మార్పుల వ్యవహారం ప్రస్తుతం పార్టీలో అంతర్గత సంక్షోభానికే దారితీసింది.