ప్రకాశం జిల్లాలో అటు తెలుగుదేశం.. ఇటు వైసీపీల్లో పరిస్థితి ఒకేలా ఉంది. బలమైన అభ్యర్థుల పేరుతో బయట నేతల్ని చేర్చుకున్న వైసీపీ అధినేత.. సొంత పార్టీలో.. సొంత కుటుంబంలో రేగుతున్న అసంతృప్తిని పరిగణించలేకపోయారు. అటు టీడీపీ అధినేత..బలమైన అభ్యర్థుల పేరుతో… ఇష్టం లేని చోట పోటీకి నేతల్ని పంపించారు. దీంతో.. రెండు పార్టీల్లోనూ.. పరిస్థితి భిన్నంగా ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ ఈ జిల్లాలో ఆధిక్యం చూపించింది. కొంత మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడంతో… పరిస్థితి మారిపోయింది.
ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీలో చేరడాన్ని జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి వ్యతిరేకిస్తున్నారు. మాగుంటకు ఒంగోలు ఎంపీ స్థానం ఖరారు చేయనుండడంతో సుబ్బారెడ్డి తీవ్రంగా అసంతృప్తికి గురయ్యాయి. పార్టీ శ్రేణులకు, నాయకులకు ఆయన అందుబాటులోకి రావడం లేదు. మాగుంట చేరిక కార్యక్రమంలో పాల్గొనలేదు. పార్టీ కీలక నాయకులు ఫోన్లు చేసినా అందుబాటులోకి రాలేదని తెలిసింది. జిల్లాలోనూ ఆయన వర్గం నాయకులు పార్టీ తీరుపై గుర్రుగా ఉన్నారు. ఈ వ్యవహారం ఎక్కడి వరకు దారి తీస్తుందో అంటూ పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలోనే.. వైవీ సుబ్బారెడ్డి వర్గానికి చెందిన వారంటూ.. చాలా మందిని సమన్వయకర్తలుగా తొలగించేశారు. దాంతో వారందరితో కలిసి ఏదైనా నిర్ణయం తీసుకుంటారా.. అన్న చర్చ నడుస్తోంది.
తెలుగుదేశం పార్టీలో అసంతృప్త నేతల పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. కనిగిరి, దర్శి టికెట్ల వ్యవహారం తెదేపాలో ఎటూ తేలడం లేదు. దర్శి నుంచి పోటీ చేసేందుకు అటు కదిరి బాబూరావు, ఇటు ఉగ్ర నరసింహారెడ్డిలలో ఏ ఒక్కరూ ఆసక్తి చూపకపోవడం, మరోవైపు మంత్రి శిద్దా తమ కుటుంబంలో ఒకరికి దర్శి టిక్కెట్ ఇవ్వాలని కోరడంతో పార్టీ అదే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి శిద్దా తనయుడు సుధీర్ పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. అటు కనిగిరిలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. యర్రగొండపాలెం టీడీపీ టిక్కెట్ అజితారావుకు కేటాయించడంతో ఇటు డేవిడ్రాజు వర్గీయులు అసమ్మతిని రాజేస్తున్నారు.
సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ వారం రోజుూ… అదే పరిస్థితి ఉంటుంది. చివరి క్షణం వరకూ.. కొన్ని టిక్కెట్లు ఖరారయ్యే అవకాశం లేదని చెబుతున్నారు. దీంతో.. ప్రకాశం జిల్లాలో వారం పాటు… అసంతృప్త జ్వాలలు ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది.