ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు తమ జిల్లా నీటి వనరుల కోసం సంఘటితంగా పోరాటం చేస్తున్నారు. నేరుగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర జలవనరుల మంత్రితో సమావేశమై తమ జిల్లా పరిస్థితిని వివరించారు. అన్యాయం చేయవద్దని కోరారు. కృష్ణా యాజమాన్య బోర్డు పరిధిలో వెలుగొండ ప్రాజెక్టును చేర్చలేదు. విభజన చట్టంలో వెలిగొండ ప్రాజెక్టు ప్రస్తావన ఉంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవ చూపడంతో ఏఐబీపీ పథకం కింద నిధులు మంజూరయ్యాయి. తెలంగాణ .. కేంద్రం నిధులు మంజూరు చేయడం చట్ట విరుద్ధమని ఆరోపిస్తూ కేఆర్ఎంబీకి లేఖ రాసింది. దీంతో టీడీపీ నేతలు వెలిగొండ కోసం పోరాటం ప్రారంభించారు.
నేరుగా కేసీఆర్కు లేఖ రాసి ప్రకాశం జిల్లా పొట్ట కొట్టవద్దనికోరిన వారు తర్వాత ఢిల్లీ వెళ్లారు. ఇంతకు ముందు ప్రకాశం జిల్లా నేతలు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పై కూడా ప్రకాశం జిల్లా నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అ ప్రాజెక్టు నిర్మిస్తే శ్రీశైలం నుంచి దిగువకు నీరు రావని అదే జరిగితే సాగర్ ఆయుకట్టు కింద చివరిలో ఉండే ప్రకాశం జిల్లా పొలాలకు నీరు అందని వారు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి జగన్కు లేఖ ద్వారా తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
అధికార పార్టీగా ఉండటంతో ప్రభుత్వం స్పందించకుండా తాము స్పందిస్తే బాగుండని వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారు. కానీ టీడీపీ నేతలు అటు కేంద్రం.. ఇటు రాష్ట్రం రెండూ ప్రకాశం జిల్లాకు అన్యాయం చేస్తున్నాయని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. జిల్లా హక్కుల కోసం తామే పోరాడుతున్నట్లుగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పోరాటాన్ని ఇంతటితో ఆపకూడదని .. ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయని రాజకీయంగా ఎటాక్ చేయాలని నిర్ణయించుకున్నారు.