బీజేపీ వ్యతిరేక పోరాటంలో ప్రకాష్ రాజ్‌ను కలుపుకుని వెళ్లాలని కేసీఆర్ డిసైడయ్యారు. బీజేపీ మత రాజకీయాలపై ప్రకాష్ రాజ్ చాలా ప్రభావవంతంగా మాట్లాడగలరని ఆయనకు దేశవ్యాప్తంగా ఉన్న గుర్తింపు వల్ల ఆయన మాటలకు మంచి ప్రచారం కూడా వస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే ఆయన అలా వ్యక్తిగత స్థాయిలో మాట్లాడిదే కలిగే ప్రభావం వేరు.. పార్టీ తరపున మాట్లాడితే వచ్చే ప్రచారం వేరు. అందుకే కేసీఆర్ విభిన్నంగా ఆలోచించి టీఆర్ఎస్ తరపున రాజ్యసభకు ప్రకాష్ రాజ్ ను పంపాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ మేరకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని అందుకే ఆయనను మహారాష్ట్ర సీఎంతో జరిగిన భేటీ కోసం ప్రత్యేకంగా తీసుకెళ్లారని చెబుతున్నారు. ఇటీవల టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో రాజీనామా చేశారు. త్వరలోనే ఎన్నిక జరగనుంది. ఆయన పదవి కాలం మరో మూడేళ్లు ఉంది. ఎమ్మెల్యేల పరంగా టీఆర్ఎస్కుతిరుగులేని ఆధిక్యత ఉంది కాబట్టి టీఆర్ఎస్ నేతే ఎంపీ అవుతారు. బండ ప్రకాష్‌ను ఎమ్మెల్సీ చేసిన సమయంలో ఆ స్థానాన్ని కవితకు ఇస్తారన్న ప్రచారం జరిగింది.
కానీ కవిత మళ్లీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు బండ ప్రకాష్ ఖాళీ చేసిన స్థానం ప్రకాష్ రాజ్కుఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజ్యసభ సీటివ్వడం ద్వారా గరిష్టంగా ప్రకాష్ రాజ్ సేవలను ఉపయోగించుకోవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ తరపున బీజేపీ వ్యతిరేక పక్షాలను కూడగట్టి.. సమన్వయం చేసే బాధ్యతలను ఆయనకే ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.