దర్శకుడిగా తనని తాను నిరూపించుకొనేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు ప్రకాష్ రాజ్. ధోనీ ఓకే అనిపించినా ఆర్థికంగా నిరుత్సాహపరిచింది. ఉలవచారు బిరియానీ కూడా సంతృప్తిని ఇవ్వలేదు. ఇప్పుడు మన ఊరి రామాయాణం సినిమా తీశారాయన. చూసినవాళ్లంతా ‘బాగుంది.. మంచి ప్రయత్నం’ అంటున్నారు. కానీ చూసిన వాళ్ల సంఖ్య చాలా తక్కువ. ఈ దసరాకి వచ్చిన అన్ని సినిమాల్లోకీ లోయెస్ట్ కలక్షన్స్ ఉన్న సినిమా ఇదే. పట్టుమని ఇరవైమంది కూడా థియేటర్లలో ఉండడం లేదు. మల్టీప్లెక్స్‌కి నచ్చే సినిమా అనుకొన్నా.. అక్కడా ఆదరణ కరవయ్యింది.
ఈ ఫలితం పై ప్రకాష్ రాజ్ అసంతృప్తితో ఉన్నాడు. అందుకే ఓ వీడియో సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ సినిమా తీస్తున్నప్పుడు తనని అందరూ భయపెట్టారని, ఐటెమ్స్, మసాలా లేకపోతే సినిమాలుచూడరన్నారని.. వాళ్లని కాదని సినిమా తీశానని, ఇప్పుడు వాళ్లే గెలిచేలా ఉన్నారని పరోక్షంగా తన ఓటమిని ఒప్పుకొన్నాడు ప్రకాష్ రాజ్. మంచి సినిమాలు చూడరన్న నిందని చెరిపేసే బాధ్యత ప్రేక్షకులదే అని గుర్తు చేస్తున్నాడు. అయితే తానేం నిరుత్సాహ పడడం లేదని, ఇకపైనా తాను మంచి సినిమాలే తీస్తానని ధైర్యంగా చెబుతున్నాడు ప్రకాష్‌రాజ్, నిజం చెప్పాలంటే.. మన ఊరి రామాయణం బెటర్ సినిమానే. ఓ చిన్న కథ చుట్టూ ఆసక్తికరంగా నడిపాడు. ప్రియమణి, ఫృద్వీల నటన అయితే భలే గా ఉంది. పొయెటిక్… ఎండింగ్ ఇచ్చిన విధానం కూడా నచ్చుతుంది.
ఇలాంటి సినిమాలకు ఆదరణ దక్కకపోవడం శోచనీయం. మంచి సినిమాలు రావూ.. రావూ… అంటుంటారు. కనీసం వచ్చినప్పుడైనా చూడాలి కదా? అదే ప్రకాష్‌రాజ్ ఆవేదన కూడా. తాను నిజంగానే ఓ కమర్షియల్ సినిమా తీయాలంటే, తన చేతులో ఉన్న డబ్బుతో, తనకున్న పరిచయాలతో భారీ హంగామా చేసి ఓ మాస్ మసాలా సినిమా నూరేద్దుడు. కానీ… వాటిపై విసుగెత్తి మెగా ఫోన్ పట్టిన వ్యక్తి.. అందరిలా కమర్షియల్ సినిమాలెందుకు తీస్తాడు? ప్రకాష్ రాజ్ నుంచి మళ్లీ మళ్లీ ఇలాంటి డీసెంట్ ప్రయత్నాలు రావాలంటే… కనీసం ఇలాంటి సినిమాల్ని కాస్త ఓపిక తెచ్చుకొని పనిగట్టుకొని చూడాల్సిందే