తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాంతీయ పార్టీల కూటమిపై చర్చించేందుకు ముంబై వెళ్లారు . ఈ సందర్భంగా ఆయనతో పాటు కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్లు వెళ్లలేదు. కవిత, సంతోష్ రావు లాంటి నేతలు వెళ్లారు. అనూహ్యంగా ఆయన ముంబై చేరుకున్న తర్వాత టీంలో ప్రకాష్ రాజ్ కూడా కనిపించారు. మహారాష్ట్ర సీఎంను ప్రత్యేకంగా గ్రీట్ చేస్తూ కేసీఆర్ టీంలో ఆయన ప్రముఖంగా కనిపించారు. దీంతో అందరిలోనూ ఒకటే ఆశ్చర్యం . కేసీఆర్ టీంలోకి ప్రకాష్ రాజ్ ఎలా వచ్చారు..? ఎందుకు వచ్చారు ? ఏ ఉద్దేశంతో ఆయనను కేసీఆర్ ముంబై తీసుకెళ్లారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
అయితే కేసీఆర్ వెంటనే జాతీయ రాజకీయాల చర్చల కోసం ప్రకాష్ రాజ్ వెళ్లడం ఇదే మొదటి సారి కాదు. గత ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నించినప్పుడు కూడా తమిళనాడు, కర్ణాటక నేతల్ని కలవడానికి వెళ్లినప్పుడు ప్రకాష్ రాజ్ తన పరిచయాలతో ఇతోధికంగా సాయం చేశారు. టీఆర్ఎస్తో ఆయన చాలా సన్నిహితంగా ఉంటారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు టీఆర్ఎస్ టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఆయన ఇండిపెండెంట్‌గా బెంగళూరులో బరిలోకి దిగారు.
ఇటీవలి మా ఎన్నికల్లో ఆయనకు ఈ పొలిటికల్ పవర్ ఉన్నా.. ఉపయోగించుకోలేదు. అటు వైపు విష్ణు.. మా బావ సీఎం అంటున్నా విష్ణు లైట్ తీసుకున్నారు. అప్పుడు టీఆర్ఎస్తో ఆయన సంబంధాలు అంత గొప్పగా లేవేమో అనుకున్నారు. నిజానికి అప్పుడు కేటీఆర్ ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తే ప్రకాష్ రాజ్ గెలిచి ఉండేవారు. కానీ అలాంటి ప్రయత్నాలు కేటీఆర్ చేయలేదు. టీఆర్ఎస్తో సంబంధాలు కరెక్ట్‌గానే ఉన్నాయని.. ప్రకాష్ రాజ్ ను మరోసారి మహారాష్ట్రకు తీసుకెళ్లడంద్వారా టీఆర్ఎస్ బయట పెట్టింది.