ప్రకాష్‌రాజ్‌లో నటుడే కాదు. సామాజిక వేత్త, నిర్మాత, దర్శకుడు కూడా ఉన్నాడు. తన దర్శకత్వంలో ‘ధోనీ’, ‘ఉలవచారు బిరియానీ’, ‘మన ఊరి రామాయణం’ లాంటి సినిమాలొచ్చాయి. అభిరుచి పరంగా ప్రకాష్ రాజ్‌కు ఈ చిత్రాలు మంచి పేరు తీసుకొచ్చాయి. అయితే ఆర్థికంగా మాత్రం నిరాశ కలిగించాయి. అందుకే కొంతకాలంగా ప్రకాష్‌రాజ్ దర్శకత్వానికి దూరంగా ఉన్నారు. `రంగమార్తండ` కూడా ఆయన దర్శకత్వంలో తెరకెక్కించాల్సిన సినిమానే. చివరి నిమిషంలో.. కృష్ణవంశీ ఆ బాధ్యత తీసుకొన్నారు. దాంతో ప్రకాష్ రాజ్ దర్శకత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టేశాడా? అనిపించింది. అయితే ఇప్పుడు మళ్లీ ఆయన మెగా ఫోన్ పట్టుకోబోతున్నారు.
‘మనలో ఒకడు’ అనే పేరుతో ప్రకాష్‌రాజ్ త్వరలోనే ఓ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నారు. ఓ మరాఠీ నాటకం ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే. దాదాపు యేడాదిగా ఆయన స్క్రిప్టు పై కసరత్తు చేస్తున్నట్టు టాక్. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించనున్నాడు. సమాజంలోని హెచ్చుతగ్గుల్నీ, అసమానతల్నీ ఈ చిత్రం ద్వారా ప్రశ్చించబోతున్నారని, ఇదో రాజకీయ వ్యంగాస్త్రం అని సమాచారం. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.