“తలైవా” కొత్త సినిమా “కాలా” విడుదలకు సిద్ధమైంది. మామూలుగా రజనీకాంత్ సినిమా అంటే ఓ రేంజ్లో హైప్ క్రియేట్ అవుతుంది. కానీ కాలా హైప్ మాత్రం ..రజనీ సినిమాల స్థాయిలో లేదు. సినిమాకు సంబంధించి భారీగా పబ్లిసిటీ చేయకపోవడం ఓ కారణం.. అదే సమయంలో పదే పదే విడుదల వాయిదా పడటం మరో కారణం కావొచ్చు. కానీ ఈ సినిమా నేపధ్యంగా … రాజకీయాలపై మాత్రం బోలెడంత చర్చ జరుగుతోంది. ఇది కమల్ హానస్ వర్సెస్ రజనీకాంత్ మధ్యలో ప్రకాష్ రాజ్ అన్నట్లుగా మారుతోంది.
కొద్ది రోజుల క్రితం కావేరీ ఇష్యూపై తలైవా రజనీకాంత్ స్పందించారు. కావేరీ విషయంలో… సుప్రీంకోర్టు తీర్పును.. కర్ణాటక అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇది తమిళుల్ని కాస్త మెప్పించి ఉండొచ్చు కానీ… కర్ణాటక వాళ్లకి మాత్రం కాలిపోయింది. అప్పటికి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఒకటి, రెండు రోజులు కాకపోయినప్పటికీ.. కుమారస్వామి రజనీకాంత్‌కు కాస్త ఘాటుగానే రిప్లయ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి స్పందన చూసి… కన్నడ సంఘాలకు ధైర్యం వచ్చిందేమో కానీ… వారు .. కాలా సినిమాను టార్గెట్ చేసుకున్నారు. కర్ణాటకకు వ్యతిరేకంగా మాట్లాడిన రజనీకాంత్ సినిమాను.. కర్ణాటకలో ప్రదర్శించనీయబోమని… చాలెంజ్ చేశారు. బాగుంటే.. వేరే సినిమాలైనా ప్రదర్శించుకోవచ్చని… థియేటర్ల యాజమాన్యాలు కాలాకు నో చెప్పాయి. డిస్ట్రిబ్యూటర్లు కూడా… ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారు. ఫలితంగా “కాలా” కర్ణాటకలో ఆగిపోయింది. ఈ మొత్తం వ్యవహారం అంతా.. రజనీ కావేరీపై చేసిన ఒకే ఒక్క ప్రకటన ద్వారా జరిగిపోయింది.
రాజకీయాల విషయంలో రజనీకాంత్‌ను డామినేట్ ప్రయత్నంలో ఉన్న కమల్ హాసన్.. కావేరీ ఇష్యూను చాకచక్యంగా ఉపయోగించుకున్నారు. రజనీకాంత్ కన్నా తనే తెలివైన రాజకీయనాయకుడినని నిరూపించేందుకు నేరుగా బెంగళూరు వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి కుమారస్వామితో చర్చలు జరిపారు. కావేరీ విషయంలో రెండు రాష్ట్రాలకు అనుకూలంగా… ఉండేలా.. ఉద్రిక్తతలు చెలరేగకుండా… వ్యవహరించాలని.. ఇద్దరూ సమావేశంలో అభిప్రాయపడ్డారు. పవన్ ఒక్క ప్రకటన ఆవేశాలకు కారణమైతే.. తాను రెండు రాష్ట్రాల మధ్య శతృత్వం పెరగకుండా చేశానని.. తానే రజనీకాంత్ కంటే గొప్ప నేతనని కమల్ హాసన్ చేతల్లో నిరూపించుకునే ప్రయత్నం చేళారు.
అయితే కమల్‌కు ఆ క్రెడిట్ దక్కకుండా చేద్దామనుకున్నారేమో కానీ.. మధ్యలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చారు. సొంత రాష్ట్రం కర్ణాటక అయిన ప్రకాష్ రాజ్.. కావేరీ సమస్యపై కర్ణాటకకే మద్దతు తెలుపుతున్నారు. కానీ కాలాకు..కావేరీకి సంబంధం లేదని.. కాలాను అడ్డుకోవడం కరెక్ట్ కాదని వాదిస్తున్నారు. అందుకే…ముఖ్యమంత్రితో సమావేశమై… కాలా విడుదలకు కర్ణాటకలో ఏర్పడిన ఇబ్బందులను…కమల్ హాసన్ ఎందుకు చర్చించలేదని.. ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. కాలా విషయాన్ని ప్రస్తావించకపోవడానికి రజనీతో.. వ్యక్తిగత వైరం కారణం అయి ఉండవచ్చని పరోక్షంగా వ్యాఖ్యానించిన ప్రకాష్ రాజ్..తన “విశ్వరూపం” సినిమాని నిషేధించిన సందర్భాన్ని గుర్తు చేసుకోవాలని కమల్‌కు సలహా ఇచ్చారు. అలా,ఇలా తిరిగి ఈ వివాదం కమల్ – రజనీ మధ్య మరింత దూరం పెంచే సూచనలే కనిపిస్తున్నాయి.