కృష్ణ వంశీ – ప్రకాష్ రాజ్… వీరిద్దరి మధ్య ఎంత అనుబంధం ఉందో… అన్నే అలకలున్నాయి. ప్రకాష్ రాజ్ అనే క్యారెక్టర్ ఆర్టిస్టులోని హీరోయిజం చూపించాడు కృష్ణవంశీ. అంతఃపురంలో.. ప్రకాష్ రాజ్ తన విశ్వరూపం ప్రదర్శించాడంటే కారణం.. కృష్ణవంశీనే. ఖడ్గంలో మరో రూటు. కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ చేసిన అన్ని సినిమాలూ.. మంచి పేరు తీసుకొచ్చాయి. అయితే మధ్యలో చాలాసార్లు గొడవ పడ్డారు. ఇక కృష్ణవంశీతో పనిచేయను.. అని ప్రకాష్ రాజ్, ప్రకాష్ రాజ్ తో సినిమా తీయను అని కృష్ణవంశీ అనేసుకొన్నారు. `గోవిందుడు అందరివాడేలే`తో ఆ గ్యాప్ పూడిపోయింది. మళ్లీ కలిసి పనిచేయడం మొదలెట్టారు. `నట సామ్రాట్` రీమేక్ `రంగ మార్తండ`లో ప్రకాష్ రాజ్ నే కీలక పాత్రధారి. అయితే ఈ సినిమా మేకింగ్ సమయంలో వీరిద్దరి మధ్య మళ్లీ గ్యాప్ వచ్చింది. సినిమా పూర్తయినా ఇంకా బయటకు రాకపోవడానికి కారణం ప్రకాష్ రాజే అనే గుసగుసలు వినిపించాయి. తన పారితోషికం ముట్టనందుకు ప్రకాష్ రాజ్ ఇంత వరకూ డబ్బింగ్ చెప్పలేదు. దాంతో సినిమాని రిలీజ్ చేసేందుకు మార్గం లేకుండా పోయింది. ఎట్టకేలకు ప్రకాష్ రాజ్ కనికరించాడు. ఈ సినిమాని తన గొంతు ఇవ్వడానికి ముందుకొచ్చాడు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ తన పాత్రకు గానూ తనే డబ్బింగ్ చెప్పుకొంటున్నాడు. రెండ్రోజుల్లో ఈ డబ్బింగ్ మొత్తం పూర్తవుతుంది. ఆ తరవాత.. విడుదల చేయడమే తరువాయి. ప్రకాష్ రాజ్ కి ఇవ్వాల్సిన పారితోషికం మొత్తం ఇచ్చేశారా, లేదంటే… బిజినెస్ మొదలయ్యాక ఇస్తామన్నారా? అనేది తెలీలేదు. మొత్తానికి ప్రకాష్ రాజ్ అలక మాని ముందుకు రావడంతో… కృష్ణవంశీ సమస్య ఒకటి తీరిపోయింది. ఇప్పుడు ఈ సినిమాకి గట్టిగా ప్రమోషన్ చేసి, విడుదల తేదీ ప్రకటించడమే తరువాయి.