భారతరత్న ప్రణబ్ ముఖర్జీ చనిపోయారు. ఆ విషయాన్ని ఆయన కుమారుడు ట్విట్టర్ ద్వారా ప్రకటించడంతో బయట ప్రపంచానికి తెలిసింది. అంతే… తెలుగు మీడియా పూనకం వచ్చినట్లుగా ఊగిపోయింది. నివాళులు అర్పించేస్తూ… అన్ని రాజకీయ పార్టీల నేతల స్పందనలు తీసుకుంటూ బిజీబిజీగా గడిపేసింది. ఆ చానల్.. ఈ చానల్ అనే తేడా లేదు. మరణించిన ప్రణబ్‌కు.. తమదైన పద్దతిలో నివాళలు అర్పించింది. దక్షిణాదిలో జాతీయ నాయకులకు పెద్దగా గుర్తింపు లేదు. ప్రణబ్‌కూ అంతే. మరి అంతగా ఓవర్ రియాక్ట్ కావాల్సిన పని లేదన్న అభిప్రాయం మీడియా విశ్లేషకుల్లో ఉంది.
అయితే అదే సమయంలో.. నేషనల్ చానల్స్ అంటే.. ఇంగ్లిష్ చానల్స్ చూసిన వారికి మతి పోయినట్లయింది. ఎందుకంటే.. జాతీయ చానళ్లు.. ప్రణబ్ ముఖర్జీ మృతిని తెలుగు చానళ్ల కంటే ఎక్కువ అతిగా.. సెన్సేషనలైజ్ చేస్తాయనుకుటే.. ఎవరో అనామకుడు పోయినట్లుగా.. చిన్న చిన్న స్క్రోలింగ్‌తో సరి పెట్టారు. చానళ్లు అన్నీ పోటీ పడి.. సుశాంత్ ఆత్మహత్య కేసులో … దర్యాప్తు చేస్తున్న సీబీఐకి పోటీగా.. తమ విచారణ సాగించాయి. రియా చక్రవర్తిని సీబీఐ తొమ్మిది గంటల ప్రశ్నిస్తే.. ఏం ప్రశ్నలు వేశారు.. ఏం సమాధానం ఇచ్చింది సహా.. మొత్తం కొన్ని “సాక్ష్యాలను” కూడా బయట పెట్టి హడావుడి చేశాయి. రాష్ట్రపతిగా పని చేసిన జాతీయ నాయకుడైన భారతరత్న చనిపోతే… ఇంగ్లిష్ చానళ్లలో కనీస స్పందన కరవైంది.
ఓ వైపు…. రీజనల్ మీడియా ప్రణబ్ దాదాకు మిగతా చర్చా కార్యక్రమాలన్నీ ఆపేసి ప్రముఖుల ద్వారా సంతాపాలు తెలియచేసే ప్రయత్నం చేస్తే.. ఇంగ్లిష్ చానళ్లకు… రియానే ఎక్కువయిపోయింది. సీబీఐతో పోటీగా తాము చేస్తున్న ఇన్వేస్టిగేషన్కే ప్రాధాన్యం ఇచ్చాయి. దీన్ని బట్టి చూస్తే.. టీవీ చానళ్ల ప్రాధాన్యతలు .. కేవలం ఒక్క టీఆర్పీ దగ్గరే ఆగిపోతాయన్నది సులువుగానే అర్థమవుతోంది. అయితే ఈ టీఆర్పీ రేసులో.. తెలుగు చానళ్లు ఇంకా వెనుకబడే ఉన్నాయి. లేకపోతే.. అక్కడ రియా తరహాలో.. ఇక్కడ 139మంది రేప్ చేశారని కేసు పెట్టిన యువతి అంశాన్ని స్వీయ ఇన్వెస్టిగేషన్ చేసేవి. కొన్ని చానళ్లు యువతి వైపు.. మరికొన్ని చానళ్లు ఆమె బ్లాక్ మెయిలింగ్ కేస్ అనే వైపు యాంగిల్ తీసుకుని రెండు రోజులు ప్రసారాలు చేసినా.. చివరిలో మాత్రం.. మీడియా విలువలు అనే పేరుతో సిగ్గుపడినట్లుగా ఉన్నారు. అందుకే దాదాకు కాస్త నివాళి తెలుగు రాష్ట్రాల్లో లభించింది.