ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ , ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడు హైదరాబాద్ ఆత్మీయ సత్కారంలోనూ మాట్లాడారు. ఇద్దరూ కూడా రాజకీయ దాడి తరహాలో గాక పెద్ద మనుషుల్లా అనుభవజ్ఞుల్లా అభిప్రాయాలు పంచుకోవడానికి ప్రయత్నించారు. కెసిఆర్ నేరుగా మీడియా వారితోనే ఇష్టాగోష్టిగా మాట్లాడితే వెంకయ్య మరింత విశాలమైన సమావేశంలో మాట్లాడారు. రెంటికీ పోలిక లేకున్నా పోల్చిచూస్తే క్రియాశీల రాజకీయాలనుంచి దూరంగా వెళుతున్న వెంకయ్య కంటే రాజకీయ కురుక్షేత్రంలో నిండా కూరుకుపోయిన కెసిఆర్ వాక్కులే మెరుగ్గా వున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాల గురించి గాని, హైదరాబాదులోని తెలుగువారి గురించి గాని లేదంటే సీట్ల పెంపు వంటి అంశాలు గాని కెసిఆర్ దాపరికం లేకుండానే పంచుకున్నారు. జనసేన గురించి ఆయన మాటలు పవన్ అభిమానులకు బాధ కలిగించినా అది ఆయన అంచనా. పైగా వారిద్దరికి ఎప్పుడూ సత్సంబంధాలు లేవు. ఇక వచ్చేఎన్నికల్లో జగన్కు అధికంగా ఓట్లు వస్తాయన్న సర్వేను బయిటపెట్టడంలోనూ ధైర్యం చూపించారు. ఎపిలో కులం ప్రభావాన్ని చెప్పారు. అయితే తెలంగాణలోనూ ఆయన చెప్పినంత తక్కువగా ఏమీ లేదన్నది నిజం. బిజెపి పెరుగుదలకు అవకాశం లేదని, మోడీ హవా ఒకసారికే పరిమితమని కూడా ధీమాగా చెప్పేశారు. ఓటుకు కోట్ల కేసు కొనసాగుతూనే వుందని మరో మినీ బాంబు వేశారు. మొత్తంపైన ఆయన మాటలు సాధారణ వ్యాఖ్యల తరహాలోనే వున్నాయి.
కాని పెద్దమనిషి తరహాలో వివాదాలకు అతీతంగా మాట్లాడాల్సిన చోట వెంకయ్య నాయుడు మాత్రం తనపై ఆరోపణలకు జవాబులిచ్చే పని పెట్టుకున్నారు. తన లక్షణాలు తనే ఒకటికి రెండు సార్లు చెప్పుకున్నారు. ఆఖరుకు తను ముందు ముందు మరింత పెద్ద పదవిలోకి వచ్చే అవకాశముందని ప్రణబ్ ముఖర్జీ అన్నట్టు చెప్పడం ద్వారా రాష్ట్రపతి పదవీ కాంక్ష ప్రకటించుకున్నారు. వెంకయ్య ఇంకా కొన్ని చెప్పుకున్నారు గాని పెద్దాయనను చిన్న బుచ్చడం ఇష్టం లేక ఆపేస్తున్నా.
్త నాకు ఈ ఇద్దరిలోనూ కెసిఆర్ మాటల్లోనే పెద్దరికం కనిపించింది.