తాతా పెళ్లి చేసుకుంటావా అంటే నాకు పిల్లనెవరిస్తారని ప్రశ్నిస్తాడే తప్ప వద్దని చెప్పడని తమాషా చేస్తుంటారు.దేశాద్యక్షుడుగా అంటే రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ పరిస్థితి అలాగే వుంది. మిగిలిన ఏ రాష్ట్రపతి చేయని విధంగా పదవిలో వుండగానే ఆయన చరిత్రపేరిట తన రాజకీయాభిప్రాయాలు గ్రంధస్తం చేసి వెలువరించారు. ఇప్పుడు పదవీ విరమణ తర్వాత గత ఇరవయ్యేళ్ల గమనం ఆవిష్కరించారు. ఇందులోనే సోనియా నిరాకరణ తర్వాత 2004లో తనను ప్రధానిని చేస్తారని ఆశించినట్టు కూడా చెప్పేశారు.తాను ప్రధానిని కాలేకపోవడం, తన స్థానంలో రాష్ట్రపతి అవుతాడనుకున్న మన్మోహన్ సింగ్ రావడం వంటి అంశాలు బాహాటంగానే వెల్లడించారు. అంత పెద్ద పదవులు నిర్వహించిన వారు తమ ఆశాభంగాలను గురించి చెప్పడం అరుదు. తాజ్ హౌటల్‌పై దాడి తర్వాత హౌం మంత్రి రాజీనామాతో తనను ఆ పదవిలోకి తీసుకుంటారని కూడా ఆశించారట. ఇది ఇలా వుంటే మన్మోహన్ సింగ్ తనకంటే ప్రణబ్ ప్రధాని స్థానానికి అర్హుడని చెప్పడం మరో విశేషం. ఇదంతాసోనియా గాంధీసమక్షంలో జరగడం, ఆవిష్కరణకు బిజెపియేతర నేతలనే పిలవడం ప్రణబ్‌దా ప్రయాణాన్ని సూచిస్తుంది. రాబోయే రోజులలో రాహుల్‌గాంధీకి రాజకీయ గురువుగా ఆయన రాబోతున్నాడనే కథనాలు ఎవరూ ఖండించడం లేదు. అంటే రాష్ట్రపతిగా చేశాక కూడా ఆయన రాజకీయ తృష్ణ తీరలేదన్నమాట. ఇంతకూ ప్రణబ్వున్నంత మాత్రాన గెలుపు ఖాయమేనా అంటే బెంగాల్లో ఆయనే చాలా సార్లు గెలవలేదు పాపం! కాకుంటే ఒక రాష్ట్రపతి రాజకీయ పున:ప్రవేశం దేశంలో కొత్త చరిత్ర అవుతుంది. రాజ్యాంగ నిషేదం ఏమీ లేదు గనక నిక్షేపంగా రావచ్చుకూడా.