ఆజన్మాంత కాంగ్రెస్ వాది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచారక్‌ల బృందానికి పాఠాలు చెప్పడం… చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఆరెస్సెస్, కాంగ్రెస్ మధ్య సిద్ధాంత వైరుధ్యాలు చూస్తే.. అది అసాధ్యం అని కూడా అనుకుంటారు. కానీ ఇప్పుడది నిజం కాబోతోంది. కాంగ్రెస్ సూపర్ సీనియర్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ… ఆరెస్సెస్ ప్రచారక్‌లకు శిక్షణ అనంతరం నిర్వహించే ముగింపు సదస్సులో ప్రసంగించడానికి అంగీకరించారు. జూన్ ఏడో తేదీన ఈ సదస్సు… ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగపూర్‌లో జరుగుతుంది.
ప్రణబ్ ఆరెస్సెస్ కార్యక్రమానికి వెళ్లడం కాంగ్రెస్‌లో ఎంత సంచలనం రేపుతోందో… బీజేపీలోనూ.. అంతే కలకలకానికి కారణం అవుతోంది. ఆరెస్సెస్‌ను నిషేధించాలని.. రాహుల్ గాంధీ తరచూ డిమాండ్ చేస్తూంటారు. బీజేపీని, ఆరెస్సెస్‌ను ఆయన విడిగా చూడరు. మహాత్మాగాంధీ హత్యకు ఆరెస్సెస్నే కారణమని ఆరోపించారు కూడా. ఇలాంటి తీవ్ర వ్యతిరేకత చూపించే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత.. అదీ కూడా రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించిన నేత ..ఇప్పుడు ఆరెస్సెస్ కార్యాలయానికి వెళ్లి పాఠాలు చెప్పబోతూండటాన్ని ఎలా సమర్థించుకోవాలో కాంగ్రెస్‌కు అర్థం కావడం లేదు. అదే సమయంలో బీజేపీలోనూ ఈ విషయంల కలకలం రేపుతోంది. కారణం.. ఆరెస్సెస్ – బీజేపీ మధ్య దూరం పెరుగుతోందన్న వార్తలు వస్తూండటమే. కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదాన్ని … మోహన్ భగవత్ తప్పు పట్టారు. అలాంటి నినాదం సమంజసం కాదన్నారు. ఆ తర్వాత కూడా… దళితుల ఇంట్లో భోజనాలు లాంటి కార్యక్రమాన్ని కూడా మోహన్ భగవత్… విమర్శించారు. ఇప్పుడు నేరుగా కాంగ్రెస్‌కు చెందిన ముఖ్యనేతను… నాగపూర్ కేంద్రం కార్యాలయానికి ఆహ్వానిస్తున్నారు. దీనిపై బీజేపీ అగ్రనేతల్లో అంతర్గతంగా చర్చలు ప్రారంభమయ్యాయి.
ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్‌తో ప్రణబ్ కు స్నేహం ఉంది. బీజేపీకి ఆరెస్సెస్ సైద్ధాంతిక మార్గదర్శి అని తెలిసి కూడా ప్రణబ్ తన మైత్రిని కొనసాగించారు. ప్రణబ్ రాష్ట్రపతి అయిన తర్వాత కూడా రెండుమూడు సార్లు మోహన్ భగవత్‌ను రాష్ట్రపతి భవన్ కు ఆహ్వానించారు. ఆరెస్సెస్ ప్రచురించే హిందూత్వ ఫిలాసఫీకి సంబంధించిన పుస్తకాలు ప్రణబ్ ఆసక్తిగా చదువుతారట. 2015లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైన మరుసటి రోజే భగవత్ రాష్ట్రపతి భవన్ కు వెళ్లి ప్రణబ్ ను కలుసుకోవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్రపతికి బీజేపీకి మధ్య ఆరెస్సెస్ వారధిగా పనిచేస్తోందని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.
రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తర్వాత ప్రణబ్ ముఖర్జీ ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. కానీ కాంగ్రెస్ పార్టీ కోసం తెరవెనుక సేవలు అందిస్తున్నారని.. ఆ పార్టీకి చెందిన నేతలు ప్రచారం చేస్తూంటారు. కానీ అది నిజం కాదని… ఇప్పుడు క్లారిటీ వస్తోంది. ఆజన్మాంత కాంగ్రెస్ వాదిగా ఉన్న ప్రణబ్ రిటైర్మెంట్ తర్వాత ఆరెస్సెస్ కేంద్ర కార్యాలయానికి ఎందుకు వెళ్తున్నారు ? ఆరెస్సెస్‌ను అంటారని పార్టీగా చూసే వారిలో మార్పు తేవాలనుకుంటున్నారా..? అన్న అంశాలపై ఏడో తేదీన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.