రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గత చరిత్రకు సంబంధించి వెలిబుచ్చుతున్న అభిప్రాయాలు అనుభవాలు కాంగ్రెస్ బిజెపిలకు ఇరకాటంగా పరిణమిస్తున్నాయి. మామూలుగా అధినేతలు పదవీ కాలం ముగిశాక జ్ఞాపకాలు ఆత్మకథలు రాస్తుంటారు. కాని ప్రణబ్ పదవిలో వుంటూనే ఆ పని మొదలు పెట్టారు. పైగా నిర్మొహమాటంగా గతంపై తన అంచనాలు చెబుతున్నారు. ఇందిరా గాంధీ హత్య తర్వాత తాత్కాలికంగా తనను ప్రధాని పదవి తీసుకోమని చెబితే నిరాకరించానని రెండవ సంపుటంలో రాశారు. పైగా రాజీవ్‌గాంధీని పూర్తిస్థాయి ప్రధానిగా నియమించాలని కోరుతూలేఖ తానే రూపొందించానని తెలిపారు. తను పదవి కోరలేదు గనక ఆ కారణంగా తనకూ రాజీవ్‌గాంధీకి మధ్య దూరం పెరిగిందనే వాదన నిజం కాదని తెలిపారు. తల్లిపై హత్యాప్రయత్నం వార్త తెలిశాక రాజీవ్ ఎలా ప్రవర్తించారో కూడా ప్రణబ్ వివరంగా తెలిపారు. రాజీవ్ కొన్ని పొరబాట్లు చేసి వుండొచ్చునంటూనే తను కూడా అంతేనని పేర్కొన్నారు. అయోధ్యలో బాబరీ మసీదు తలుపులు తీయడం రాజీవ్ పొరబాటనీ, షాబానూ కేసులో చట్ట సవరణ మరో తప్పిదమనీ తెలిపారు. అయితే బాబరీ మసీదు విధ్వంసం మోసపూరితమని బిజెపిని తప్పుపట్టారు. మొత్తంపైన ఆయన కీలకమైన అంశాలపై తన అబిప్రాయాలు ముందే వెల్లడించాలని భావించడం విశేషమే. ఈ బెంగాలీ దాదా మరెన్ని సత్యాలు బయిటపెడతారో కనిపెట్టి చూస్తుండాలి.