హైదరాబాద్:రాష్ట్రపతి. దేశ ప్రథమ పౌరుడు. ఆయన నివాసం కోసం ఢిల్లీలో అతిపెద్ద భవంతి. మరి ఆ రాష్ట్రపతి భవన్లో ప్రతినెలా ఫోన్ వాడకానికి ఎంత ఖర్చు చేస్తారో తెలుసా? 5 లక్షలకు పైనే. అవును. ముంబైకి చెందిన మన్సూర్ దర్వేష్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా ఈ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ వివరాల ప్రకారం, రాష్ట్రపతి భవన్ ఫోన్ బిల్లు 5.06 లక్షలు.
రాష్ట్రపతి భవన్ అలవెన్సుల మొత్తం భారీగా పెరుగుతూ ఉంది. 2012-13లో ఈ మొత్తం 30.96 కోట్లు. 2014-15లో ఏకంగా 41.96 కోట్లకు ఎగబాకింది. అంటే 33 శాతం పెరిగింది. రాష్ట్రపతి భవన్ సేవలో మొత్తం 754 మంది పనిచేస్తున్నారు. ఇందులో 9 మంది ప్రయివేట్ సెక్రటరీలున్నారు. 27 మంది డ్రైవర్లున్నారు. 64 మంది సఫాయి వాలాలున్నారు. 8 మంది టెలిఫోన్ ఆపరేటర్లున్నారు.
రాష్ట్రపతి భవన్ ఖర్చులపై తనాు అడిగిన మేరకు పూర్తి వివరాలు రాలేదని దర్వేష్ అంటున్నారు. అలవెన్సులు, ఫోన్ బిల్లులు వగైరాలే చెప్పారని ఆయన అభిప్రాయం. అన్ని రకాల ఖర్చులనూ లెక్కేస్తే నెలకు వంద కోట్లకు పైగానే రాష్ట్రపతి భవన్ పై ఖర్చవుతుందని ఆయనన్నారు. ఇదంతా ప్రజల సొమ్మే కదా అని ఆయన గుర్తు చేశారు. దాదాపు 50 కోట్ల మంది ప్రజలు పేదరికంలో మగ్గుతున్న దేశంలో, ఒక్క భవనం కోసం ఇన్ని కోట్లు ఖర్చు చేయడం భావ్యమా అని ఆయన ఆవేదన చెందుతున్నారు.
విదేశీ అతిథులు వచ్చినప్పుడు వారి గౌరవార్థం రాష్ట్రపతి విందు ఇస్తుంటారు. దీనికి పెద్ద సంఖ్యలో ప్రముఖులు హాజరవుతారు. అలాగే స్వాతంత్ర్య దినోత్సవం, గణ తంత్ర దినోత్సవం, ఇతర సందర్భాలలో, పద్మ పురస్కారాల సందర్భంగానూ అతిథులకు మర్యాదలు చేయడానికి, భోజనాలకు భారీగానే ఖర్చవుతుంది. ఇంత పెద్ద దేశానికి రాష్ట్రపతి అయినప్పుడు ఈ మాత్రం ఖర్చుండదా అనే వారూ ఉన్నారు.