మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ అనే యువకుడి హత్య ఘటనలో సుభాష్ శర్మ అనే నిందితుడికి ఉరిశిక్ష వేస్తూ నల్గొండ కోర్టు తీర్పు ఇచ్చింది. మిగతా నిందితులకు యావజ్జీవశిక్ష విధించింది. ఈ కేసులో ఏ వన్ గా ఉన్న ప్రణయ్ భార్య అమృత తండ్రి మారుతీరావు ఇప్పటికే చనిపోవడంతో ఆయనకు శిక్ష ఖరారు చేయలేదు.
మిర్యాలగూడకు చెందిన ప్రణయ్, అమృత ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కులాలు వేరు కావడంతో అమృత తండ్రి అంగీకరించలేదు. అయినా వారు పెళ్లి చేసుకుని మిర్యాలగూడలోనే కాపురం పెట్టారు. తండ్రితో సంబంధాలను అమృత తెంచుకున్నారు. అయితే ప్రణయ్‌ను చంపేస్తే.. అమృత మళ్లీ ఇంటికి వస్తుందనుకున్న మారుతీరావు .. సుపారీ గ్యాంగ్ తో హత్యకు పథకం పన్నారు.ఉత్తరాదికి చెందిన అస్గర్ అలీ అనే గ్యాంగ్ లీడర్ తో ఒప్పందం చేసుకున్నాడు. వారి గ్యాంగ్ కు చెందిన సుభాష్ శర్మ.. ప్రణయ్, అమృత ఆస్పత్రికి వెళ్లి వస్తున్న సమయంలో దారి కాచి ఒక్క వేటుతో నరికేసి పారిపోయాడు. ప్రణయ్ అక్కడిక్కడే చనిపోయాడు.
ఈ కేసు సంచలనం సృష్టించింది. ఎన్నో చర్చలకు కారణం అయింది. అటు మారుతీరావును సమర్థించిన వారు కూడా ఉన్నారు. ఈ కేసులో బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత మారుతీరావు హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. సుదీర్గ విచారణ తర్వాత నిందితులకు శిక్ష పడింది.