హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై వివిధ న్యూస్ ఛానల్స్, మీడియా సంస్థలు గురువారం, శుక్రవారం వెలువరించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు చాలావరకు తప్పుల తడకగా తేలిన సంగతి తెలిసిందే. ప్రముఖ జాతీయా న్యూస్ ఛానల్ ఎన్డీటీవీకూడా వాటిలో ఒకటి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతోందని ఆ ఛానల్ ప్రకటించింది. ఈ తప్పుడు ఫలితాలకుగానూ ఎన్డీటీవీ క్షమాపణ తెలిపింది.
నిన్న ఉదయం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభమైనపుడు ఎన్డీఏ ముందంజలో ఉంది. దాదాపు ఒక గంట, గంటన్నరవరకు ఆ కూటమి ముందంజలో ఉన్నట్లు కనిపించింది. దీనితో అన్ని ఛానల్స్ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు వార్తలు ఇచ్చేసి విశ్లేషణలుకూడా ప్రారంభించాయి. 9.30 గంటలనుంచి అసలు సీన్ ఆవిష్కృతమవటం మెల్లగా ప్రారంభమయింది. 10 గంటలకల్లా నితీష్ కూటమిదే విజయమని స్పష్టత వచ్చేసింది.
ఎన్డీవీ అధినేత ప్రణయ్ రాయ్ తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పినందుకు క్షమాపణ చెప్పారు. హంస రీసెర్చ్ అనే సంస్థ తమ తరపున సర్వే నిర్వహించి ఈ ఫలితాలను ఇచ్చిందని, ఆ సంస్థను వివరణ కోరతామని అన్నారు. 30 ఏళ్ళుగా ఎన్నికల వార్తలు, విశ్లేషణలకు ఎన్డీటీవీ ఎంతో పేరు గడించిందని గుర్తు చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో కొద్దిగా అటూ, ఇటూ రావటం సహజమేనని, కానీ ఈసారి బాగా తేడా వచ్చిందని అన్నారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పాయని చెప్పారు. గ్రీస్, బ్రిటన్, టర్కీ, అమెరికా దేశాలలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తాము ఇంత పెద్ద ఎత్తున తప్పుడు అంచనా వేయటం 32 సంవత్సరాల క్రితం, ఎన్.టి.రామారావు విషయంలో జరిగిందని, మళ్ళీ బీహార్లో ఇప్పుడు జరిగిందని చెప్పారు. వీక్షకులను అయోమయానికి గురిచేసినందుకు క్షమాపణ చెబుతున్నామని, నిష్పక్షపాతంగా, ఖచ్చితంగా, వేగంగా వార్తలు ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని ప్రణయ్ రాయ్ అన్నారు.