ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్‌రావుకు సంబంధించి అనేక నిజాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా, ఎస్ఐబీలోని లాగిన్ రూమ్, స్పెషల్ ఆపరేషన్ టీమ్ దిలో ఫోన్ ట్యాపింగ్ పరికరాలను, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసిన ప్రణీత్‌రావు.. వాటిని తీసుకెళ్లి వికారాబాద్ అడవుల్లో పడేయటంతో ఆ పరికరాల కోసం ఒక ప్రత్యేక పోలీసు బృందం గాలింపులు జరుపుతున్నది. ఆ హార్డ్ డిస్క్లలోనే తాను ట్యాపింగ్ చేసిన ప్రతిపక్ష నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వ్యాపారుల డేటా ఉన్నదనీ, వాటిని విధ్వంసం చేయటం ద్వారా ఆధారాలు దొరకకుండా చేయాలనేది ప్రణీత్‌రావు కుట్రగా దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనక ప్రధాన సూత్రధారిగా బీఆర్ఎస్కు చెందిన ఒక సీనియర్ నాయకుడు కీలక పాత్ర వహించినట్టుగా కూడా ప్రణీత్‌రావు బయటపెట్టినట్టు సమాచారం. అదే సమయంలో, సిరిసిల్ల, వరంగల్‌తో పాటు హైదరాబాద్‌లోని ఒక మీడియా సంస్థ యజమాని కార్యాలయంలో సర్వర్లను పెట్టి వాటి ద్వారా ఫోన్ ట్యాపింగ్‌లకు ప్రణీత్‌రావు పాల్పడినట్టు కూడా వెలుగు చూసింది. ప్రణీత్‌రావు దగ్గర దొరికిన ఒక డైరీలో వందల సంఖ్యలో ఫోన్ నెంబర్లు ఉన్నాయనీ, వాటన్నిటినీ ట్యాపింగ్ చేసినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. అందులో అప్పటి అధికారపక్షం కోరుకున్న ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాపింగ్లతో పాటు పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మరికొందరు ఇతర వ్యాపారులు, సెలబ్రిటీలవి ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్టు తెలుస్తున్నది.
మీడియా యజమాని కోరిన మేరకు మరికొందరి ఫోన్ ట్యాపింగ్‌లకు కూడా ప్రణీత్‌రావు పాల్పడినట్టు బయట పడింది. మొత్తమ్మీద, ప్రణీత్‌రావు కొన్నేండ్ల కిందనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలకు తెరలేపినట్టు తెలుస్తున్నది. దీనికి సంబంధించి ప్రణీత్‌రావుకు సహకరించారనే అనుమానాలున్న మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లను అదుపులోకి తీసుకొని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విచారిస్తున్నట్టు తెలిసింది.
ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుండి ప్రత్యేక సాఫ్ట్ వేర్ తీసుకువచ్చి వాడినట్టు విచారణలో తెలింది. ఆ సాఫ్ట్ వేర్ సహాయంతో టెలిఫోన్ సర్వీసులకు సంబంధం లేకుండా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారు. విదేశాల నుండి ప్రత్యేక సాఫ్ట్ వేర్ తెప్పించింది ఎవరు అన్నది కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇది పెగాసస్ సాఫ్ట్ వేరా లేకపోతే.. అంతకంటే అత్యాధునికమైనదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. మరో వైపు తన కస్టడీ అక్రమం అంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.