హైదరాబాద్: తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉన్న బాపు బొమ్మ ప్రణీత ఇటీవల కొద్దిగా టైమ్ దొరికితే చాలు సొంత ఊరు బెంగళూరుకు వెళ్ళిపోతోంది. కన్నడ సినిమాలేమైనా చేస్తోందా అంటే అదేమీ లేదు. సొంతవాళ్ళు కన్నడవారు అసలు పట్టించుకోవటంలేదని ఎప్పటినుంచో తెగ బాధ పడిపోతోంది. మరి బెంగళూరు తరచుగా ఎందుకు వెళుతోంది అని ఆరా తీస్తే అమ్మడు అసలు విషయం చల్లగా బయటపెట్టింది. ప్రణీత ఇటీవలే వ్యాపార రంగంలోకి ప్రవేశించింది. బెంగుళూరు నగరంలో లావెల్లె రోడ్లోని ఒక రెస్టారెంట్లో భాగస్వామ్యం తీసుకుంది. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంటే తనకు మొదటినుంచీ ఒక క్రేజ్ అని, ఏదైనా వ్యాపారం చేపట్టాలని చూస్తుండగా, ఈ రెస్టారెంట్ ప్రతిపాదన రావటంతో వెంటనే తీసుకున్నానని చెప్పింది.
ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి చెబుతూ, ‘బ్రహ్మోత్సవం’లో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా చేస్తున్నానని తెలిపింది. ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా వేయటంపట్ల తానేమీ బాధ పడటంలేదని, మహేష్ పక్కన నటించే అవకాశం రావటమే గొప్పగా భావిస్తున్నానని చెప్పింది. పాత్ర చిన్నదా, పెద్దదా అనేది తాను చూడనని, తమిళ చిత్రం ‘మాస్’లో తన పాత్రకు రెండే డైలాగ్స్ ఉంటాయని, సీన్స్, మోంటేజ్ మాత్రం ఎక్కువ ఉంటుందని తెలిపింది. అన్నట్లు ఈ అమ్మడు ఇవాళ బెంగళూరులో తన బర్త్డే జరుపుకుంటోంది.