పోలీసులంటే వైసీపీ చోటా నేతల నుంచి ఎమ్మెల్యేల వరకూ ఎంత చులకనో.. తరచూ బయటపడుతోంది. ఉండవల్లి శ్రీదేవి లాంటి ఎమ్మెల్యేలు సీఐలపై విరుచుకుపడితే… కాస్త సీనియర్లైనా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిలాంటి వాళ్లు ఏకంగా ఎస్పీల మీదే బూతు పురాణం వినిపిస్తున్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ..తన ప్రసంగంలో నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఎవరనుకుంటున్నారు..? ఏమనుకుంటున్నావు..? మీ డీజీపీ కాపాడుతాడనుకుంటున్నా.. ? అంటూ చెలరేగిపోయారు. ఎక్కడ నుంచో వచ్చావు.. రెండు రోజులు ఉంటావు .. పోతావు … అధికారంలో వున్న మామాట వినవా అంటూ ఆవేశపడిపోయారు. అంతటితో వదిలి పెట్టలేదు. నాతో పెట్టుకుంటే ఇక్కడ ఉండలేవు అని కూడా వార్నింగ్ కూడా ఇచ్చారు.
రెండునెలలు వుంటావో.. మూడు నెలలు ఉంటావో తెలియదు కానీ ఉన్నన్ని రోజులూ మంచిగా ఉండమని కూడా సలహా ఇచ్చారు. అంతే కానీ తమాషాలు పడొద్దనన్నారు. మా ఖర్మ కొద్దీ ఎస్పీగా వచ్చావంటూ తలకొట్టుకున్నారు. ఇంతకీ కారణం ఏమిటంటే.. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. కొంత మంది టీడీపీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టమన్నారు. అయితే ఈ విషయం ఎస్పీ దృష్టికి వెళ్లింది. ఆయన పోలీసులకు తప్పుడు కేసులు పెట్టవద్దని చెప్పారు. దీంతో పోలీసులు టీడీపీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టలేదు. తాను చెప్పినా కేసులు పెట్టలేదని.. నల్లపురెడ్డి అలా ఫైరయ్యారు. అసలు నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్యే సమన్వయం లేదు. ఎస్పీ, కలెక్టర్లు.. మంత్రి అనిల్ కుమార్ చెప్పిన మాటలే వింటారు. ఇతరుల మాటలు వినడంలేదు. తమ మాట చెల్లుబాటు కావడం లేదని ఇతర నేతలు.., ఇలా.. వారిని తిట్టిన తిట్టు తిట్టకుండా… తిట్టి ఒత్తిడి పెంచాలని అనుకుంటూ ఉంటారు.
సాధారణంగా టీడీపీ నేతలు పోలీసులుపై మామూలు విమర్శలు చేస్తేనే.. పోలీసు అధికారుల సంఘాలు.., ప్రెస్నోట్లతో ఖండన ప్రకటనలు విడుదల చేస్తూ ఉంటాయి. ఇప్పుడు తమను అంత కంటే దారుణంగా మాట్లాడిన నల్లపురెడ్డిపై ఏమైనా ప్రకటన చేస్తారో లేదో చూడాలి. ఎందుకంటే… అధికార పార్టీ నేతలు తమను ఏమైనా అనొచ్చని.. కానీ ప్రతిపక్ష నేతలు మాత్రం… ఏమైనా అంటే.. తమకు పరువు తక్కువ అని పోలీసు అధికారుల సంఘాలు అనుకుంటున్నట్లుగా కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.