నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సిపి నేతలు చెప్పిన విధంగా మాత్రమే అధికారులు పనిచేయాలని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఇందుకూరుపేట లో ఒక సమావేశం లో పాల్గొన్నారు. ఆ మధ్య వై ఎస్ ఆర్ సి పి బలపర్చిన అభ్యర్థులను ఓడించి ప్రజలు టిడిపి సర్పంచులను గెలిపించుకోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ఏం తప్పు చేశారని వైఎస్ఆర్ సీపీ బలపరిచిన అభ్యర్థులను ఓడించారు అంటూ సభాముఖంగా ఆయన జనాలను ప్రశ్నించారు. టిడిపి తరఫున గెలిచిన అభ్యర్థులు అందరూ దిష్టిబొమ్మల వంటివారే అంటూ ఆయన ఎద్దేవా చేశారు. టిడిపి తరుపున గెలిచి ఇప్పుడు పనుల కోసం తమ వద్దకు వచ్చే టిడిపి సర్పంచులను, నాయకులను ఎట్టి పరిస్థితుల్లోనూ తమ దగ్గరకు రానివ్వము అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తాము వారిని రానివ్వకపోవడమే కాదు, అధికారులు సైతం వారు చెప్పే పనులు చేయకూడదని ఆయన సూచించారు. వైఎస్ఆర్ సిపి నేతలు చెప్పినప్పుడు మాత్రమే వారు చెప్పిన విధంగా అధికారులు పనిచేయాలని అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదం అవుతున్నాయి.
ఏది ఏమైనా ప్రభుత్వం , మంత్రులు, అధికారులు అన్న వారు పార్టీలకతీతంగా ప్రజలందరి కోసం పని చేయవలసి ఉంది అన్న సంగతిని మన పాలకులు ఎప్పటికీ అర్థం చేసుకుంటారో అన్న వ్యాఖ్యలు ప్రజల నుండి వినిపిస్తున్నాయి.