టాలీవుడ్లో అడుగుపెట్టినవాళ్లంతా పవన్ పేరు ప్రస్తావించకుండా ఉండలేరేమో! బహుశా… అందరి దృష్టినీ తమ వైపుకు తిప్పుకోవడానికి పవన్ కల్యాణ్ పేరు ఓ మంత్రంలా పనిచేస్తుందనుకొంటారేమో. ఇప్పుడు ప్రసన్న కూడా పవన్ పేరే జపిస్తున్నాడు. ప్రసన్న అంటే గుర్తుండదేమో. స్నేహ భర్త అంటే టక్కున గుర్తొచ్చేస్తాడు. సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన `జవాన్` చిత్రంలో ప్రతినాయకుడిగా మెప్పించాడు ప్రసన్న. తమిళంలో బిజీ నటుడు. ఇప్పటికే పాతిక సినిమాలు చేసేశాడు. తెలుగులోనూ కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక్కడి పరిశ్రమ గురించి మాట్లాడుతూ ”టాలీవుడ్ చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడి నుంచి వస్తున్న ప్రోత్సాహం మర్చిపోలేనిది. ఇక్కడి ప్రేక్షకులు తమ అభిమాన నటీనటుల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకొంటారు. ‘జవాన్’ ఆడియో ఫంక్షన్లో మెగా అభిమానుల సందడి కళ్లారా చూశాను. పవర్ స్టార్ అని పేరు చెబితే.. చాలు గోల గోల చేశారు. ఆయన నటించిన సినిమా పేరు చెప్పినా… అంతే స్పందన చూశా. పవన్ క్రేజ్ చూసి ఆశ్చర్యపోయాను. ఇక్కడి హీరోలు చాలా అదృష్టవంతులు. తమని దేవుడిగా భావించే అభిమానులు ఉండడం మామూలు విషయం కాదు. తెలుగులో మరిన్ని పాత్రల కోసం, మంచి సినిమాల కోసం ఎదురుచూస్తున్నా..” అని చెప్పాడు ప్రసన్న. ‘జవాన్’లో ప్రసన్న నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమాతో తనకు మరిన్ని అవకాశాలు ఖాయంగానే కనిపిస్తోంది.