Prasanna Vadanam Movie Telugu Review
తెలుగు360 రేటింగ్ 2.75/5
-అన్వర్
ఈరోజుల్లో ప్రేక్షకులకు విజువల్ ఎక్స్పీరియన్స్ అయినా ఇవ్వాలి, లేదంటే కాన్సెప్ట్ తో అయినా కట్టి పడేయాలి. ఈ రెండింటిలో ఏది లేకపోయినా సినిమా తేలిపోతుంది. బడా సినిమాలకు స్టార్ల అండదండలు ఉంటాయి. చిన్న సినిమాలకు కాన్సెప్ట్ మస్ట్ అండ్ షుడ్! ఈ నిజం తెలుసుకొని, అలాంటి వెరైటీ కథలతోనే ప్రయాణం చేస్తున్నాడు సుహాస్. తన బలం… కథల ఎంపికనే. ఈసారి ‘ప్రసన్నవదనం’ అనే సినిమాతో వచ్చాడు. ఈ సినిమాలోని వెరైటీ కాన్సెప్ట్ ఏమిటంటే… హీరోకి ఫేస్ బ్లైండ్నెస్ ఉండడం. అంటే ఎవరి ముఖాల్నీ గుర్తించలేడన్నమాట. కాన్సెప్ట్ అయితే బాగుంది. మరి ట్రీట్మెంట్ ఎలా వుంది? ఈ పాయింట్ తో రెండుగంటల పాటు దర్శకుడు ప్రేక్షకుల్ని మెప్పించగలిగాడా?
సూర్య (సుహాస్) ఓ ప్రమాదంలో తల్లిదండ్రుల్ని కోల్పోతాడు. దాంతో పాటు విచిత్రమైన సమస్య వెంటాడుతుంది. తను మనుషుల ముఖాల్ని గుర్తుపట్టలేడు. గొంతుల్ని కూడా. కేవలం కొన్ని గుర్తులతో ఆ మనిషి ఎవరన్నది గమనించగలుగుతాడంతే. అలాంటి సూర్య ఓ మర్డర్ కళ్లారా చూస్తాడు. అయితే చేసిందెవరో తెలీదు. ఇదే విషయం పోలీసులకు ఫోన్ చేసి చెబుతాడు. అప్పటి నుంచీ… సూర్యపై ఎటాక్స్ మొదలవుతాయి. కొత్త కేసులు, హత్యా నేరాలూ నెత్తి మీద పడతాయి. వాటి నుంచి సూర్య ఎలా బయటపడ్డాడు? అతని ప్రయాణంలో ఏసీపీ వైదేహీ (రాశీసింగ్) పాత్రేమిటి? అనే విషయాలు తెరపైనే చూడాలి.
ఫేస్ బ్లైండ్నెస్ అనేది తెలుగు సినిమా వరకూ కొత్త పాయింట్. ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయలేదు కూడా. ఇలాంటి కాన్సెప్ట్ ని ఎంచుకోవడం అభినందించదగిన విషయమే. సాధారణంగా సినిమాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు గతం మర్చిపోతారు. అయితే ఇక్కడ వెరైటీ ఏంటంటే.. హీరోకి ఎవరి ఫేసులూ రిజిస్టర్ కావు. గొంతులూ గుర్తు పట్టలేడు. ఇలాంటి విచిత్రమైన పరిస్థితిల్లో హీరోని నెట్టేసి, తనని ఓ మర్డర్ కేసులో సాక్షిగా నిలవడం కొత్త పాయింట్! ఈ చిత్రంతో సుకుమార్ శిష్యుడు అర్జున్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. సుకుమార్ అంటేనే లాజిక్కు. ఆయనకే లాజిక్ నేర్పిన శిష్యుడు అర్జున్. దాంతో ఈ కథని అనేకనేక లాజిక్కులతో నడిపేసి ఉంటాడని ప్రేక్షకుడు కూడా భావించడంలో తప్పులేదు. దానికి తగ్గట్టుగానే దర్శకుడు కొన్ని ఉపయుక్తమైన లాజిక్కుల్ని వేసుకొంటూ కథని నడిపాడు. ప్రారంభ సన్నివేశంతోనే కథలోకి వెళ్లిపోయాడు దర్శకుడు. సెకండ్ సీన్లోనే హీరో సమస్య ఏమిటో ప్రేక్షకుడికి అర్థమైపోతుంది. ఓ దొంగని పట్టుకోవడంలో తప్పటడుగు వేసిన సీన్‌తో.. హీరో క్యారెక్టర్‌లోని కన్ఫ్యూజన్ తెలిసిపోతుంది. హీరోకి ఉన్న సమస్య రెండు మూడు సీన్లతోనే తెలిసిపోయినప్పుడు దాన్ని మరీ సాగదీయాల్సిన అవసరం లేదు. లవ్ ట్రాక్ లో కూడా దర్శకుడు ఇదే పాయింట్ పై ఫోకస్ పెట్టాడు. దాంతో.. ఆ సీన్లు కాస్త ఫన్‌గా అనిపించినా, ఒకే పాయింట్ చుట్టూ తిరుగుతున్న భావన కలిగిస్తాయి.
మర్డర్ సీన్ నుంచి కథలో ఆసక్తి మొదలవుతుంది. అక్కడ్నుంచి కేవలం మర్డర్ అనే పాయింట్ పై ఫోకస్ చేస్తే బాగుండేది. మధ్యలో లవ్ ట్రాక్ కూడా నడిచిపోతూ ఉంటుంది. ఇలాంటి కథల్ని చాలా స్ట్రయిట్ గా చెప్పాలి. మధ్యలో ట్రాకుల జోలికి వెళ్లకూడదు. కానీ దర్శకుడు మాత్రం కాలక్షేపం చేశాడు. మర్డర్ చేసిందెవరో ముందే చెప్పేశాడు. అప్పుడే దాని వెనుక మరో బలమైన హస్తం ఉంటుందని ప్రేక్షకులు ఊహించగలరు కూడా. ఇలాంటి కథల్లో మొదట కొన్ని పాత్రలపై అనుమానం కలిగేలా చేసి, చివర్లో.. మరో కొత్త పాత్రని దోషిగా చూపించడం వాడేసిన ట్రిక్కే. ఇక్కడా అదే కనిపిస్తుంది. అయితే దాన్ని కాస్త షాకింగ్ గానే చూపించగలిగాడు దర్శకుడు. తొలి సగంలో అక్కడక్కడ కాస్త త్రోటుపాట్లు, అనవసరమైన లాగ్ కనిపించినా, ఇంట్రవెల్ బ్యాంగ్ దగ్గర కాస్త సంతృప్తి దొరుకుతుంది. ‘ఇది కదా మనకు కావాల్సింది’ అనే ఫీలింగ్ వస్తుంది.
అయితే ద్వితీయార్థంలో కథనం మరింత బిగువుగా ఉండాల్సింది. చాలాసార్లు దర్శకుడు కాలయాపన చేశాడు. కథని తనకు అవసరం వచ్చినట్టు నడిపించాడు. కొన్ని సీన్ల ప్రారంభం, ముగింపు.. టైమర్ లో పెట్టుకొని చూస్తే ‘ఈ సీన్ మరీ ఇంత సుదీర్ఘంగా ఎందుకు సాగిందో’ అనిపిస్తుంది. షార్ప్‌గా చెప్పాల్సిన విషయాల్ని చాదస్తం కొద్దీ `లాగ్` చేసిన విధానం బోర్ కొట్టిస్తుంది. ఉదాహరణకు.. గోవింద్ అనేవాడ్ని పట్టుకోవడానికి హీరో వెళ్లే సీన్, అక్కడ జరిగే తతంగం దాదాపు 10 నిమిషాలు నడుస్తుంది. హీరోకున్న లోపాన్ని ఈ సీన్లో గోవింద్ అనే పాత్ర తెలివిగా వాడుకొంటుంది. ఆ కాన్సెప్ట్ బాగుంది. కానీ మరీ 10 నిమిషాలు సాగదీయడంతో ఆ కొత్తదనం వల్ల కలిగే అనుభూతి కూడా ఆవిరైపోతుంది. ఈ మర్డర్ వెనుక ఎవరెవరు ఉన్నారు? అనేది రివీల్ చేసే సీన్ చాలా చప్పగా సాగింది. ఫ్లాష్ బ్యాక్‌లోనూ మెరుపులేం ఉండవు. మర్డర్‌కు ఏదో ఒక మోటీవ్ ఉండాలి కాబట్టి, దాన్ని వాడుకొందాం అనే పద్ధతిలో సాగిపోయింది. అయితే క్లైమాక్స్ లో మళ్లీ కాస్త ఊపొచ్చింది. ‘కలర్’ కాన్సెప్ట్ ని వాడుకొని, క్లైమాక్స్ డిజైన్ చేసిన విధానం దగ్గర దర్శకుడికి మార్కులు పడతాయి. మొదట్లో ఓ పాప చెప్పిన కథని లింక్ చేస్తూ, క్లైమాక్స్‌లో హీరో రియాక్ట్ అవ్వడం బాగుంది. ఆ లాజిక్, ఆ తెలివితేటలు.. మధ్యమధ్యలో వాడి ఉంటే.. ‘ప్రసన్నవదనం’ మరో స్థాయిలో ఉండేది. షార్ప్ గా చెప్పాల్సిన విషయాల్ని సాగదీయడం వల్ల, కొన్ని సీన్లు బాగున్నా, వాటి ఇంపాక్ట్ బలంగా కనిపించలేదు.
సుహాస్ తన ఇమేజ్‌కి, స్థాయికి తగిన కథల్ని ఎంచుకొంటున్నాడు. హీరోయిజం చూపించాలని తాపత్రయపడడం లేదు. కథకి ఏం కావాలో అది చేస్తున్నాడు. ఇందులోనూ తనదైన సహజ నటన ప్రదర్శించాడు. మిగిలిన నటీనటులు ఎలా చేశారు? అనేది పక్కన పెడితే, చాలా క్యారెక్టర్లు మిస్ కాస్టింగ్ తో బోసిబోయాయి. మరీ ముఖ్యంగా ఏసీపీ పాత్ర. కథకు ఈ పాత్ర చాలా కీలకం. అలాంటి చోట ఎవరో తెలియని నటిని తీసుకొచ్చి నిలబెట్టారు. ఆమె ఎక్స్ప్రెషన్స్ విషయంలో తేలిపోయింది. కాస్త స్టార్ డమ్ ఉన్న కథానాయిక అయితే… ఆ క్యారెక్టర్ ఆసాంతం నిలబడేది. ఎస్.ఐ పాత్రధారీ అంతే. వరుణ్ పాత్రలో నందుని సరిగా వాడుకోలేదు. సత్య రెండు సీన్లకే పరిమితం. హీరోయిన్ గా పాయల్ లుక్స్ ఏమాత్రం గొప్పగా లేవు. ఆ పాత్రని క్లైమాక్స్ లో వాడుకోవడం కాస్త బాగుందంతే.
దర్శకుడిలో విషయం ఉంది. కొన్ని సీన్లు బాగా డీల్ చేశాడు. అయితే ఓ విజయవంతమైన చిత్రాన్ని అందించడానికి అది సరిపోదు. మంచి కాన్సెప్ట్ పట్టుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు, దాన్ని బిగుతైన స్క్రీన్ ప్లేతో మెస్మరైజ్ చేసే విషయంలో తడబడ్డాడు. ఇంట్రవెల్ బ్యాంగ్, క్లైమాక్స్ బాగున్నాయి. అయితే మధ్యలో కూడా కొన్ని మెరుపులు తోడవ్వాల్సింది. మేకింగ్ విషయంలోనూ దృష్టి పెట్టాలి. పాటలకు స్కోప్ లేదు. నేపథ్య సంగీతంలో విజిల్ మిక్స్ చేసిన ఓ ట్రాక్ కాస్త హాంటింగ్ గా ఉంది. మొత్తంగా చూస్తే అక్కడక్కడ కొన్ని షాకులతో సాగి, సినిమా పూర్తయ్యేసరికి ‘ఈ పాయింట్ ని ఇంకాస్త బాగా తీయొచ్చు కదా’ అనే ఫీలింగ్ తీసుకొస్తుంది ఈ `ప్రసన్నవదనం`.
తెలుగు360 రేటింగ్ 2.75/5
-అన్వర్