ఎన్నికల సలహాదారు ప్రశాంత్ కిశోర్‌ను వైఎస్ఆర్సిపి ప్లీనరీలో గొప్పగా పరిచయం చేసి ప్రచారం కల్పించడం సరైందేనా అన్న చర్చ ఒకటి రాజకీయ వర్గాల్లో నడుస్తున్నది. గతంలో బిజెపి వంటి పార్టీలు ఆయన సేవలు వినియోగించుకున్నా ఇంతటి ప్రచారం ఇవ్వలేదని బహిరంగంగా ప్రదర్శించలేదని చెబుతున్నారు. దానివల్ల మొత్తం ప్లీనరీతో వచ్చిన రాజకీయ వూపు సడలిపోయిందని ఆయనెవరో వుంటే తప్ప గెలవలేమని చెప్పినట్టయిందని ఒక విమర్శ. అయితే జగన్ ఉద్దేశపూర్వకంగానే ప్రశాంత్ కిశోర్‌ను వేదికపై పరిచయం చేశారని మరో అభిప్రాయం. ఆయన సేవల కోసం చాలా పార్టీలు ప్రత్యర్థులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో బహిరంగంగా కమిట్ చేయించడం మంచిదని అనుకున్నారట. పైగా పార్టీ వారిలో ఆత్మ విశ్వాసం కలిగించడానికి ఉపయోగమని కూడా భావించారు. ఇక పార్టీ రాష్ట్ర నేతల ప్రతినిధుల ఆశ మరో విధంగా వుంది. ప్రశాంత కిశోర్ ప్రజలను ప్రభావితం చేయకపోయినా కనీసం తమ నాయకుణ్ని ప్రభావితం చేస్తే చాలునని వారంటున్నారు. ఆయనకు ఏదైనా సలహా ఇచ్చి అమలు చేయించుకోవడం కష్టంగా వుంది గనక ఈయనను అందుకైనా ఉపయోగించుకోవచ్చని వారు ఆశపడుతున్నారు. పికె ప్రభావం ఇప్పటికే పడింది గనకే షర్మిల వేదికపైకి రాగలిగారని, రాజకీయ తీర్మానంలో కూడా ఆమె ప్రస్తావన సాద్యమైందని వారు వివరిస్తున్నారు. బిజెపి వ్యూహాలు మారుతున్న రీత్యా వారికి పూర్వాశ్రమ మిత్రుడైన పికె ఒక వారధిగా వుంటారనే అభిప్రాయం కూడా వుంది.