అదేంటో ‘క్వీన్’ రీమేక్ లో ముందు నుంచీ చాలా చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఈ సినిమాని తెలుగులో తీద్దామనుకున్నప్పుడు చాలామంది దర్శకుల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. చివరికి నీలకంఠకు రీమేక్ బాధ్యతలు అప్పగించారు. ఆయన కొంత పనిచేసి.. మధ్యలోంచి వెళ్లిపోయారు. అటు తిరిగి ఇటు తిరిగి ఈ సినిమా ప్రశాంత్ వర్మ చేతికి అందింది. ‘అ’తో మెప్పించిన ప్రశాంత్ వర్మ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. అయితే ఏమైందో ఏమో… ”దర్శకుడిగా టైటిల్ కార్డులో నా పేరు వెయొద్దు” అన్నాడట. దాంతో చిత్రబృందం కూడా దర్శకుడెవరన్నది దాచడానికి ప్రయత్నిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లో ఎక్కడా ప్రశాంత్ వర్మ పేరు లేదు. రేపు స్క్రీన్ పైన కూడా కనిపించే అవకాశాలు లేవు. దాంతో దర్శకుడు లేకుండానే ఈ సినిమా విడుదలైపోతోంది. సెట్లో మళ్లీ ఏమైనా లుకలుకలు జరిగాయా, లేదంటే సినిమా అవుట్ పుట్‌పై అనుమానం వచ్చి, ప్రశాంత్ వర్మ తెలివిగా తనని తాను హైడ్ చేసుకున్నాడా, లేదంటే సగం సినిమా నీలకంఠ తీశారు కదా.. నా పేరు వేసుకోవడం ఎందుకు?? అని ఇలాంటి సూచన చేశాడా?? అనేది ఆసక్తికరంగా మారింది. `క్వీన్`ని దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ రీమేక్ చేస్తున్నారు. వేరు వేరు పేర్లు, వేర్వేరు దర్శకులు, వేర్వేరు కథానాయికలు ఉన్నా ఒకే నిర్మాణ సంస్థ ఈ నాలుగు సినిమాల్నీ రూపొందిస్తోంది.