ప్రశాంత్ కిషోర్ రాజ్యసభ జాక్ పాట్ కొట్టబోతున్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ నుంచి ప్రశాంత్ కిషోర్‌ను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బెంగాల్ అసెంబ్లీలో బలం ఆధారంగా తృణమూల్‌కు నాలుగు రాజ్యసభ స్థానాలు వస్తాయి. ఇందులో ఒకటి ప్రశాంత్ కిషోర్‌కు ఇవ్వాలని మమతా బెనర్జీ నిర్ణయించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం.. మమతా బెనర్జీ రాజకీయ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెను గెలిపించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇలాంటి సమయంలో..దీదీ కూడా.. పీకేకి జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించారు.
రాజకీయాల్లో గేమ్ చేంజర్‌గా మారిన సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్.. గళమెత్తుతున్నారు. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ కారణంగానే బీహార్ జేడీయూ నుంచి ఆయన బహిష్కరణకు గురయ్యారు. పీకేను పెద్దల సభకు పంపితే పార్టీకి మరింత బలం చేకూరే అవకాశం ఉందని దీదీ భావిస్తున్నారు. అయితే.. ప్రశాంత్ కిషోర్ అంత కంటే పెద్ద ప్రణాళికాల్లో ఉన్నారు. ఆయన నేరుగా బీహార్‌పైనే గురి పెట్టారు. సొంత పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నారని కూడా చెబుతున్నారు. ప్రత్యేకంగా ఓ కార్యాచణ ఖరారు చేసుకుని ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
ఎన్నికల వ్యూహకర్త అనే వృత్తి ద్వారా.. పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ సొంత రాష్ట్రం బీహారే. ఆయన కు ఉన్న రాజకీయ ఆసక్తులతో.. జేడీయూలో చేరారు. నితీష్ కుమార్ కూడా.. ప్రశాంత్ కిషోర్‌ను.. తన రాజకీయ వారసుడిగా ప్రకటించి అక్కున చేర్చుకున్నారు. కానీ.. సీఏఏ విషయంలో విబేధించడంతో.. గెంటేశారు. ఆ రాజకీయం చాలని.. తాను దూసుకెళ్తానన్నట్లుగా.. పీకే తీరు ఉంది. ఆయన బీహార్ పైనే దృష్టి పెట్టాలనుకుంటే.. రాజ్యసభ తీసుకోరని… ఒక వేళ పదవి.. తన రాజకీయ పయనానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుందనుకుంటే తీసుకుంటారని అంటున్నారు. మొత్తానికి ఇప్పుడు రాజకీయ పరంగా అత్యంత అదృష్టవంతుడు ఎవరు అంటే ఒక్క ప్రశాంత్ కిషోరేనని చెప్పుకోవచ్చు.