పొలిటికల్ స్ట్రాటజిస్టు నుంచి పొలిటికల్ లీడర్ గా మారిన ప్రశాంత్ కిషోర్ తాను క్లాస్ కాదని మాస్ అని నిరూపించేందుకు ఫీల్డ్ లోకి దిగుతున్నారు. ఇంత కాలం ఆయన పాదయాత్రలు చేసి నీతులు చెప్పినట్లుగా రాజకీయాలు చేసేవారు. ఇప్పుడు లాఠీ దెబ్బలు తింటూ ఆమరణ దీక్షలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
బీహార్లో పరిస్థితి గందరగోళంగా మారుతోంది. అక్కడ ఇటీవల ఉద్యోగ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్ష పేపర్ లీకయిందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో పరీక్షను రద్దు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝుళిపిస్తున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. నితీష్ ప్రభుత్వ తీరుపై అంతా మండిపడుతున్నారు.
నిరుద్యోగులపై దాడి చేస్తారా అని జన్సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు , రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ జనవరి 2 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు. దీనిపై మానవహక్కుల కమిషన్ను ఆశ్రయిస్తానని ప్రకటించారు. వెంటనే విద్యార్థుల డిమాండ్ మేరకు పరీక్ష రద్దు చేయాలని పీకే అంటున్నారు. స్ట్రాటజిస్టుగా ఇప్పటి వరకూ రాజకీయ పార్టీలు ఆందోళనలు ఎలా చేయాలో.. దీక్షలు ఎలా చేయాలో ఆయన ప్లాన్ చేసి ఇచ్చి ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది.
జనసురాజ్ పార్టీ తరపున ఇటీవల ఉపఎన్నికల్లో అభ్యర్థుల్ని నిలబెట్టారు. డిపాజిట్లు తెచ్చుకోలేపోయారు కానీ..ఫలితాలను ప్రభావితం చేసేంత ఓట్లు సాధించారు. దీంతో ఆయన ఉత్సాహంగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్నారు.