రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ త్వరలోనే టిఆర్ఎస్ పార్టీ తో కలిసి పని చేయనున్నాడా? 2024 లోక్సభ ఎన్నికలలో మోడీని గద్దె దించడమే లక్ష్యంగా బిజెపి యేతర పక్షాలను ప్రశాంత్ కిషోర్ ఏకం చేయనున్నాడా? ఆ కూటమిలో టీఆర్ఎస్ కూడా ఉండబోతోందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి వివరాల్లోకి వెళితే..
2014లో మోడీని గద్దెనెక్కించడం లో ప్రశాంత్ కిషోర్ ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇక 2019లో ఆంధ్రప్రదేశ్లో ప్రశాంత్ కిషోర్ తనను ముఖ్యమంత్రి చేస్తాడని ఎన్నికలకు ముందు జగన్ ఒక బహిరంగ సభలో వ్యాఖ్యానించిన విధంగానే ప్రశాంత్ కిషోర్ జగన్ కు తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సంగతి కూడా తెలిసిందే. అయితే తాజాగా మమతా బెనర్జీ, స్టాలిన్ లను గద్దెనెక్కించిన తర్వాత తాను రాజకీయ వ్యూహకర్త పనికి స్వస్తి పలుకుతున్నానని ప్రశాంత్ కిషోర్ ప్రకటన చేశాడు. అయితే ఆయన సహచరులు ఆయా పార్టీలకు సేవలందించడం కొనసాగిస్తాయి.
అయితే తాజాగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం ప్రశాంత్ కిషోర్ 2023 అసెంబ్లీ ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీకి సేవలు అందించబోతున్నారు. ఎంత కాదనుకున్నా 10 సంవత్సరాల పాలన తర్వాత కెసిఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఆ వ్యతిరేకత ని , ఇటు బిజెపి రాజకీయ వ్యూహాలను తట్టుకొని మూడోసారి గట్టెక్కాలంటే ప్రశాంత్ కిషోర్ సేవల అవసరం ఉందని టిఆర్ఎస్ పార్టీ ప్రముఖులు భావిస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా ప్రశాంత్ కిషోర్ రాబోయే లోక్ సభ ఎన్నికలలో బిజెపి యేతర పక్షాలను మమతా బెనర్జీ సారథ్యంలో ఒక తాటిపైకి తెచ్చి ప్రయత్నం చేస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే ప్రశాంత్ కిషోర్ తో అవగాహన కుదిరిన పక్షంలో టీఆర్ఎస్ కూడా ఆ బీజేపీయేతర కూటమిలోకి వచ్చినట్లే అనుకోవాలి.
మరి రాజకీయాల్లో ఉద్దండుడు అయిన కెసిఆర్ ప్రశాంత్ కిషోర్ సహాయాన్ని తీసుకుంటారా ? ఒకవేళ కాంగ్రెస్ కూడా అదే కూటమిలో ఉన్నప్పటికీ, బీజేపీయేతర కూటమి లో ఉంటారా అన్నది వేచి చూడాలి.