బీహార్ ఉపఎన్నికల్లో పోటీకి ప్రశాంత్ కిషోర్ తన పార్టీని రెడీ చేశారు. జన సురాజ్ పేరుతో పార్టీ పెట్టిన ఆయన నేరుగా అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు ముందే తన పార్టీ బలాన్నిప్రజలకు… బయట ప్రపంచానికి చూపించాలనుకుంటున్నారు. అందుకే నాలుగు స్థానాల ఉపఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించిన వెంటనే అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. ఆప్ తరహాలో చదువుకున్న వారిని, జనాల్లో పని చేసే వారిని ఎంపిక చేసుకుంటున్నారు.
ఎన్నికల స్ట్రాటజిస్టుగా ప్రశాంత్ కిషోర్‌కు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. అయితే స్ట్రాటజిస్టులు రాజకీయాలు చేయలేరని అనుకుంటారు. దాన్ని తప్పని నిరూపించాలని ఆయన అనుకుంటున్నారు. స్ట్రాటజిస్టుగా తనకు వచ్చిన క్రేజ్ ను బట్టి ఆయన నితీష్ కుమార్ వారసుడిగా జేడీయూలోకి అడుగు పెట్టారు.కానీ అక్కడి రాజకీయాలను తట్టుకోలేక బయటకు వచ్చారు. అప్పుడే ఆయనను ఎగతాళి చేశారు. మళ్లీ ఆయన కొన్నాళ్ల తర్వాత సొంత పార్టీ పెట్టుకున్నారు.
జనసురాజ్ పేరుతో మొదట ఓ సంస్థను పెట్టి పాదయాత్రను చేశారు. మధ్యలో కాలి గాయం కారణంగా వదిలేశారు. తర్వాత జన సురాజ్ ను పార్టీగా మార్చారు. ఇప్పుడు ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కనీసం ఒక్క సీటులో గెలిచినా ఆయన పార్టీకి మంచి భవిష్యత్ ఉంటుంది. గెలుపోటముల్ని నిర్దేశించే స్థాయిలోను ఓట్లను చీల్చినా పీకే రాజకీయాల్లో ముద్ర వేయగలుగుతారు. అందు కోసం తన స్ట్రాటజీలను పూర్తి స్థాయిలో ప్రయోగించబోతున్నారు.