రాజకీయ వ్యూహకర్త పనుల నుంచి వైదొలిగానని ప్రకటించిన ప్రశాంత్ కిషోర్.. తన మిషన్‌ను డిసైడ్ చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. అదే.. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం. ఆయన రాహుల్ ,ప్రియాంకలతో ఢిల్లీలో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. భవిష్యత్ రాజకీయాలపై ఆలోచనలు పంచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీని కాంగ్రెస్ పార్టీని ఒక్కటే ఎదుర్కోవడం సాధ్యం కాదని… అన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకుని వెళ్లాల్సి ఉందని.. రాహుల్ గాంధీ నాయకత్వానికి అన్ని పార్టీలు ఏకగ్రీవంగా అంగీకరిస్తేనే.. సమస్య పరిష్కారం అవుతుందని.. ప్రజల్లో మోడీకి ప్రత్యామ్నాయం అనే భావన వస్తుందని పీకే విశ్లేషించినట్లుగా తెలుస్తోంది.
బెంగాల్ ఎన్నికల తర్వాత పీకే ప్రాభవం మరింత పెరిగిపోయింది. ఆయనను వ్యూహకర్తగా పెట్టుకునేందుకు అనేక రాజకీయ పార్టీలుప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఆయన మాత్రం..కాంగ్రెస్ పార్టీకి పని చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చొరవ తీసుకుని ప్రాంతీయ పార్టీల నేతలను కలుస్తున్నారు. శరద్ పవార్‌తో పలుమార్లు భేటీ అయి.. ఏకాభిప్రాయం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మమతా బెనర్జీ…స్టాలిన్లను కూడా.. ఆయన ఒప్పించే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ ప్రధఆనమంత్రి అభ్యర్థిత్వానికి అందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలిపితే.. తాను వ్యూహకర్తగా పని చేయడానికి సిద్ధమని గతంలో ఆయన ప్రకటించినట్లుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు రాహుల్, ప్రియాంకలతో చర్చలు జరపడంతో అది నిజమేనని భావిస్తున్నారు.
వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇప్పటికే విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో పీకే.. వ్యూహాలు మరింతగా… బీజేపీ వ్యతిరేక కూటమికి ఉపయోగపడతాయని అంచనా వేస్తున్నారు. అయితే అందర్నీ ఏకతాటిపైకి తీసుకురావడం పెద్ద టాస్క్అని.. ధర్డ్ ఫ్రంట్.. ఫోర్త్ ఫ్రంట్ అంటూ పెడితే అది బీజేపీ నెత్తిన పాలు పోయడమేనని పీకే గట్టి అభిప్రాయంతో ఉన్నారు. ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో వేచి చూడాలి..!