కాంగ్రెస్ రధసారధి ఎవరు? అంటే పార్టీ ఎవరయినా తడుముకోకుండా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అనో లేదా ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీయనో చెపుతారు. మరి కొన్ని కాంగ్రెస్ నేతలు ప్రియాంకా వాద్రా పేరుని ఆమె భర్త రాబర్ట్ వాద్రా పేర్లను కూడా ప్రస్తావిస్తుంటారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం తామెవరం కాము మోడీని, నితీష్ కుమార్ ని గెలిపించిన ప్రశాంత్ కిషోరే రాబోయే ఎన్నికలలో మా పార్టీ రధసారధి అని చెప్పుకోవడం విశేషం. మోడీని గెలిపించిన ఆ చేత్తోనే మా పార్టీని కూడా గెలిపించమని కాంగ్రెస్ అధిష్టానం ఆయనని కోరడం, అందుకు ఆయన అంగీకరించడం రెండూ విచిత్రంగానే ఉన్నాయి. విచిత్రం ఎందుకంటే భిన్న ద్రువాలవంటి కాంగ్రెస్, భాజపాలకు, అసలు ఎక్కడా పొంతనే లేని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీలకు ఒకే వ్యక్తి ఎన్నికల వ్యూహాలు రచిస్తునందుకు!
అంటే న్యాయవాది డబ్బు కోసం ఏ కేసునయినా వాదిస్తున్నట్లే, ఆయన కూడా డబిస్తే ఏ పార్టీ తరపునయినా ఎన్నికల ప్రచార వ్యూహాలు రచించడానికి సిద్ధం అన్నమాట. పార్టీలు వాటి సిద్దాంతాల గురించి ఆలోచించకుండా ఒకసారి ఒక పార్టీకి మరొకసారి దానిని వ్యతిరేకించే పార్టీకి పనిచేయడం చాలా గొప్ప విషయమే.
ఇదివరకు ఈ పనిని పార్టీలో కొమ్ములు తిరిగిన సీనియర్ నేతలే చక్కబెట్టేవారు కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా ఈ పనిని ‘అవుట్ సోర్సింగ్’ కి ఇవ్వడం సరికొత్త ట్రెండ్ అనుకోవచ్చు. మోడీ మొదలుపెట్టిన ఈ ట్రెండ్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఉపయోగ పడుతుండటం కూడా గొప్ప విషయమే. ఈ ట్రెండ్ కొనసాగుతున్నప్పుడే ప్రశాంత్ కిషోర్ స్పూర్తితో దేశంలో యువత ఈ సరికొత్త అవకాశాలని అందిపుచ్చుకొనే ఆలోచన చేస్తే మంచిదేమో?
ఇంక విషయంలోకి వస్తే, వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వాటిలో కాంగ్రెస్ పార్టీని ‘గెలిపించే కాంట్రాక్టు’ ప్రశాంత్ కిషోర్ కే దక్కింది. దక్కింది అనేకంటే కాంగ్రెస్ అధిష్టానమే ఆయనకీ కట్టబెట్టిందని చెప్పుకొంటే సముచితంగా ఉంటుంది. అయితే ఆయన ప్రధాని కావలసిన రాహుల్ గాంధీని ఉత్తర ప్రదేశ్ ఎన్నికలలో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా నిలబెట్టమని సూచించడంతో కాంగ్రెస్ జీవులు ఆయనపై మండిపడ్డాయి. దానితో ఆయన ఆ ‘గెలిపించే కాంట్రాక్ట్’ ని వదులుకోవడానికి సిద్దమయినట్లు వార్తలు వచ్చేయి. కానీ ఆ తరువాత ఏమి జరిగిందో తెలియదు కానీ తాము ఆ కాంట్రాక్ట్ నుంచి తప్పుకోలేదని, ‘పని పూర్తయ్యేవరకు’ అదే పని మీద ఉంటామని ఆయన సంస్థ ఇండియన్ పీపుల్ యాక్షన్ కమిటీ (ఐపాక్) ఒక ట్వీట్ మెసేజ్ పెట్టింది.
రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి ఎన్నికలలో గెలిపిస్తారనుకొంటే, పార్టీతో అసలు సంబంధమే లేని ఎవరో బయట వ్యక్తి వచ్చి గెలిపించే బాధ్యత తీసుకోవడం చాలా విచిత్రంగానే ఉంది. మరి ఆయనకే పార్టీ పగ్గాలు అప్పజెప్పేస్తే సరిపోయేది కదా? మహామహులు నడపించిన కాంగ్రెస్ పార్టీని ఇటలీకి చెందిన సోనియా గాంధీ చేతిలో పెట్టినప్పుడు అందరూ ఇలాగే చాలా ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఇప్పుడు అసలు పార్టీతో సంబంధమే లేని వ్యక్తి చేతిలో పెడుతున్నారు. పార్టీని నీట ముంచినా, పాల ముంచినా ఇంకా ఆయనదే భారం. రాహుల్ గాంధీది మాత్రం కాదు.