ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా వస్తొన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే పేరు పరిశీలనలో ఉంది. `దేవర` పూర్తవ్వగానే `డ్రాగన్`ని పట్టాలెక్కిస్తారు. ఈలోగా మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని ఎంపిక చేసే పనిలో పడింది చిత్రబృందం. కథానాయికగా రష్మిక పేరు దాదాపుగా ఖాయమైంది. ఎన్టీఆర్ – రష్మికలు కలిసి నటించే చిత్రం ఇదే అవుతుంది. ప్రతినాయకుడి పాత్ర కోసం బాలీవుడ్ నుంచి ఓ హీరోని దింపే ప్రయత్నం జరుగుతోంది. అందుకోసం సంప్రదింపులు కూడా మొదలయ్యాయి.
ప్రస్తుతానికి సీనియర్ నటుడు బాబీ డియోల్‌తో దర్శక నిర్మాతలు మాట్లాడుతున్నట్టు సమాచారం అందుతోంది. ప్రస్తుతం బాబీ డియోల్ సౌత్ ఇండియన్ సినిమాపై ఫోకస్ పెట్టాడు. ‘హరి హర వీరమల్లు’ సినిమాలో ఔరంగజేబ్ పాత్రని పోషిస్తున్నాడు. ఇప్పుడు ‘డ్రాగన్’ కూడా ఒప్పుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. పారితోషికం, డేట్లు… అన్నీ సర్దుబాటు అయితే బాబీ డియోల్ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చేసినట్టే. ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇటీవల గోవాలో ఓ కీలకమైన షెడ్యూల్‌ని పూర్తి చేసుకొంది చిత్రబృందం.