‘కేజీఎఫ్’ తరవాత.. ప్రశాంత్ నీల్ పేరు టాలీవుడ్ లో మార్మోగిపోయింది. ఎన్టీఆర్‌ని కలిశాడని, మహేష్‌కి కథ చెప్పాడని, ప్రభాస్ తో సినిమా చేస్తాడని రకరకాల వార్తలు. మైత్రీ మూవీస్ ప్రశాంత్ నీల్ ని లాక్ చేసుకోవడం, ఎన్టీఆర్ తో సినిమా ఒప్పించడం వల్ల ప్రశాంత్ – ఎన్టీఆర్ కాంబో… సెట్టయిపోయింది. కాకపోతే.. వార్తలు మాత్రం ఆగలేదు. ఈమధ్యే.. ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబో ఓకే అయిపోయిందని… కన్నడ సీమలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అక్కడ మీడియా అంతా ఈ కాంబోపై ఫోకస్ పెట్టింది. ప్రశాంత్ నీల్ తీసిన `ఉగ్రం`కి ఇది రీమేక్ లాంటిదని చెప్పుకొచ్చారు.
కానీ.. ఇంతలోనే… ప్రభాస్ ఈ కాంబో లేదని పరోక్షంగా తేల్చేశాడు. `ఆది పురుష్` సినిమాని ప్రకటించిన ప్రభాస్, రూమర్లకు పరోక్షంగా చెక్ పెట్టేశాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభాస్- ప్రశాంత్ కాంబో సెట్ అవ్వడం… దాదాపు కుదరని పని. ఎందుకంటే.. ప్రభాస్ చేతిలోని సినిమాలు పూర్తయ్యే సరికి మరో నాలుగేళ్లయినా పడుతుంది. ఈలోగా.. చాలా మార్పులొచ్చేస్తాయ్. `ఆది పురుష్` ఓకే అయిపోవడంతో.. ప్రశాంత్ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ సినిమాపై దృష్టి పెట్టొచ్చు. ప్రశాంత్ అనే కాదు.. ప్రభాస్ కోసం కథలు రెడీ చేస్తున్నవాళ్లంతా ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించుకోక తప్పదు.