కరోనా, లాక్ డౌన్ వల్ల.. దర్శకులకు పూర్తిగా పనిలేకుండా పోయింది. సినిమాలకు బ్రేక్ ఇవ్వడంతో కొంతమంది ఇంటిపట్టునే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకొంతమంది తమ స్క్రిప్టులకు మెరుగులు దిద్దుకుంటున్నారు. అయితే యువ దర్శకులు మాత్రం ఈ ఖాళీ టైమ్ ని కూడా క్యాష్ చేసుకోగలుగుతున్నారు. ఓటీటీలకు అనువైన కథల్ని రాసి, డబ్బులు చేసుకుంటున్నారు. ప్రశాంత్ వర్మ అందుకు తాజా ఉదాహరణ.
అ, కల్కి, జాంబీ రెడ్డి.. ఇలా విభిన్నమైన చిత్రాలతో ఆకట్టుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు హాట్ స్టార్ కోసం ఓ కథ అందించాడట. ప్రశాంత్ వర్మ అందించిన కథతో హాట్ స్టార్ లో ఓ వెబ్ సిరీస్ రూపొందుతోంది. ఓటీటీలకు సరిపడా మరో రెండు కథలు తన దగ్గర సిద్ధంగా ఉన్నాయని, ఒకటి హిందీలోనూ, మరోటి తెలుగులోనూ రాబోతోందని ప్రశాంత్ వర్మ తెలిపాడు. బయోపిక్లంటే తనకు చాలా ఇష్టమని, పుల్లెల గోపీచంద్ బయోపిక్‌పై కొంత వర్క్ చేశానని, అయితే అప్పటికే ఆ కథని ఓ దర్శకుడు సినిమాగా తీస్తున్నాడని తెలిసి, దాన్ని పక్కన పెట్టేశానంటున్నాడు ప్రశాంత్ వర్మ. త్వరలోనే ఓ సోషియో ఫాంటసీ సినిమా తీస్తానని, అందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నానని ప్రకటించాడు.