రూ.40 కోట్లతో తీసిన ‘హనుమాన్’ ఏకంగా రూ.350 కోట్లు చేజిక్కించుకొంది. దర్శకుడిగా ప్రశాంత్ వర్మ స్టామినా అది. తెలుగునాట సూపర్ హీరోస్ కథలకు తాను ఊతం ఇచ్చాడు. ‘హనుమాన్’ తరవాత అందరి దృష్టీ… ‘హనుమాన్ 2’పైనే. ఈసినిమా ఎప్పుడొస్తుందా? ఇందులో స్టార్లు ఎవరెవరు ఉంటారా? హనుమాన్ క్యారెక్టర్ లో ఎవర్ని చూపిస్తారా? అనే ఆసక్తి మొదలైంది. ప్రశాంత్ వర్మ కూడా ఓ వైపు మోక్షజ్ఞ సినిమా స్క్రిప్టు పనులు చేస్తూనే మరోవైపు… ‘హనుమాన్ 2’కి సంబంధించిన వర్క్ కూడా పూర్తి చేస్తున్నాడు. మోక్షజ్ఞ ప్రాజెక్టు అవ్వగానే `హనుమాన్ 2` పట్టాలెక్కుతుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అంశం ఇప్పుడు బయటకు వచ్చింది. అదేంటంటే… ‘హనుమాన్ 2 కోసం ప్రశాంత్ వర్మ రూ.50 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నాడట. అదే నిజమైతే ఈ అంకెకు ఇండస్ట్రీ మొత్తం షేక్ అవ్వాల్సిందే.
టాలీవుడ్ లోనే కాదు, దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకొనే దర్శకుడు రాజమౌళి. ఆయన స్టామినా అది. ఆ తరవాత తెలుగులో త్రివిక్రమ్, సుకుమార్ ఆ స్థాయిలో ఉన్నారు. ఇద్దరి పారితోషికం రూ.50 కోట్లకు పైమాటే. త్రివిక్రమ్, సుకుమార్ తరవాత ఆ స్థాయి పారితోషికం ఆశిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. పైగా లాభాల్లోనూ వాటా కావాలంటున్నాడట. రూ.50 కోట్లు ఇచ్చి, లాభాల్లో వాటా ఇవ్వడానికి నిరంజన్ రెడ్డి సిద్ధంగా లేరని, అందుకే ఈ ప్రాజెక్టు మైత్రీ చేతికి వెళ్లందన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ‘హనుమాన్’ ద్వారా నిర్మాత దాదాపు రూ.300 కోట్లు లాభాలు చూశారు. ‘హనుమాన్ 2’ కూడా కచ్చితంగా బాక్సాఫీసు దగ్గర సంచలనం సృష్టించే సత్తా ఉన్న సినిమానే. అందుకే ప్రశాంత్ వర్మ అడిగినంత ఇవ్వడంలో తప్పులేదన్నది కొందరి వాదన.
ఇందులో మరో కోణం కూడా ఉంది. `హనుమాన్` రూ.40 కోట్లలో లాగించేశారు. `హనుమాన్ 2`కి అది కుదరదు. పెరిగిన భారీ అంచనాల నేపథ్యంలో ఎక్కువగానే ఖర్చు పెట్టాల్సివస్తుంది. పైగా ఈ సినిమాలో రిషబ్ శెట్టి లాంటి స్టార్లు కనిపించబోతున్నార్ట. వాళ్లకు గట్టిగానే పారితోషికం ఇవ్వాలి. అంటే.. ఖర్చు విషయంలో పార్ట్ 1కీ పార్ట్ 2కీ పొంతన లేదు. మరి రాబడి అదే స్థాయిలో ఉంటుందా, అనేది ఊహించలేని విషయం. అందుకే రూ.50 కోట్లు ఇచ్చి, లాభాల్లో వాటా పంచడం వర్తా, కాదా? అనే విషయంలో తర్జన భర్జనలు జరుగుతున్నాయని, ఇవన్నీ పూర్తయ్యాకే `హనుమాన్ 2`పై ఓ క్లారిటీ వస్తుందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.