కరోనా వల్ల చిత్రసీమకు ఏదైనా మంచి జరిగిందంటే.. అది ఓ కొత్త జొనర్ పుట్టుకురావడమే. కరోనా తరవాత.. ఈ ఉపద్రవం నేపథ్యంలో కొన్ని కథలు వస్తాయని చిత్రసీమ ముందే ఊహించింది. అయితే దానికి కాస్త టైమ్పడుతుందేమో అనుకుంటే, మన వాళ్లు ఆగేట్టు లేరు. వరుసగా అలాంటి కథలు సిద్ధం చేసేస్తున్నారు. రాంగోపాల్ వర్మ కరోనా నేపథ్యంలో ఓ సినిమా తీశానని ప్రకటించాడు. టీజర్ కూడా విడుదల చేశాడు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ కూడా కరోనా నేపథ్యంలో ఓ సినిమా మొదలెట్టాడు. ఈ రోజు… మోషన్ పోస్టర్ కూడా విడుదల చేశాడు. మోషన్ పోస్టర్ చూస్తుంటే కర్నూలు కొండారెడ్డి బురుజు బ్యాక్ డ్రాప్లో ఈ కథ చెబుతున్నట్టు అనిపిస్తోంది. ప్రశాంత్ వర్మ ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. అ, కల్కి చిత్రాలలో తన మార్క్ కనిపించింది. కరోనా నేపథ్యంలో తెరకెక్కుతున్న తొలి సినిమా కాబట్టి, ప్రేక్షకులు ఆసక్తి చూపించే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ 40 శాతం షూటింగ్ పూర్తయిందని సమాచారం. త్వరలోనే టైటిల్ ప్రకటిస్తారు.