ప్రశాంత్ వర్మ – మోక్షజ్ఞ కాంబోలో ఓ సినిమా రావాల్సివుంది. గత వారమే క్లాప్ కొట్టుకోవాల్సిన ప్రాజెక్ట్ ఇది. అయితే అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. అసలు ఈ సినిమా ఉంటుందా, ఉండదా? ఉంటే ఎప్పుడు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నలు. ఈ ప్రాజెక్ట్ కి దాదాపు పుల్ స్టాప్ పడిపోయినట్టే అని కొందరు అంటుంటే, ఏదోలా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయమని మరికొందరు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ ఆగిపోతే… ప్రశాంత్ వర్మ 4 నెలల కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ప్రీ ప్రొడక్షన్ పనుల్ని దాదాపు పూర్తి చేశాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ విజువలైజేషన్ పనులు పూర్తయ్యాయి. టీమ్ లో చాలామందికి అడ్వాన్సులు కూడా ఇచ్చేశారు. రేపు ముహూర్తం అనగా ముంబై నుంచి టీమ్ దిగింది. వాళ్ల బస, ఏర్పాట్లూ అన్నీ జరిగిపోయాయి. ఇలాంటి సమయంలో సడన్గా ముహూర్తం కాన్సిల్ అయ్యింది.
నిజానికి మోక్షజ్ఞ డ్రాప్ అయితే, మరో హీరోతో ఈసినిమాని పట్టాలెక్కించాలి. ప్రశాంత్ వర్మకి ఆ అవకాశం లేదు. ఎందుకంటే ఈ కథ కేవలం మోక్షజ్ఞకు మాత్రమే సెట్ అవుతుంది. తనని దృష్టిలో ఉంచుకొనే ఈ పాత్ర రాశాడు. బాలయ్య కోసమే ఓ క్యారెక్టర్ డిజైన్ చేశాడు ప్రశాంత్ వర్మ. మోక్షజ్ఞ – బాలయ్య లేకపోతే… రాసిన సన్నివేశాలన్నీ వృథానే. కాబట్టి ఈ కథ మోక్షునే చేయాలి. లేదంటే పక్కన పెట్టేయాలి. అటు బాలయ్యకు కూడా ఈ కథని వదులుకోవడం ఇష్టం లేదు. అందుకే మళ్లీ ప్యాచప్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఏం అవుతుందో చూడాలి.