ముందు నుంచీ… విభిన్నమైన దారినే వెళ్తున్నాడు ప్రశాంత్ వర్మ. తను ఎంచుకొనే ప్రతీ కథా… తెలుగు ప్రేక్షకులకు ఓవ కొత్త జోనర్ ని పరిచయం చేసింది. ‘హనుమాన్’ తో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకొన్నాడు. తన ఫోకస్ అంతా ‘హనుమాన్ 2’ పై పెట్టాడు. అయితే ఈమధ్యలో ప్రశాంత్ వర్మ నుంచి మరో సినిమా రాబోతోంది. అదే `ఆక్టోపస్`. నిజానికి `హనుమాన్` కంటే మొదలైన ప్రాజెక్ట్ ఇది. షూటింగ్ దాదాపుగా పూర్తయిన తరవాత `హనుమాన్`ని పట్టాలెక్కించాడు. ఇప్పుడు మళ్లీ ‘ఆక్టోపస్’పై దృష్టి పెట్టాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్యాచ్ వర్క్‌ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు వర్మ.
నిజానికి ఇదేం కమర్షియల్ సినిమా కాదు. ఓరకంగా చెప్పాలంటే ప్రయోగాత్మక చిత్రం. ఈ కథలో ఉన్నవన్నీ మహిళా పాత్రలే. అంటే.. ‘లేడీస్ స్పెషల్’ అన్నమాట. దాదాపు ఐదుగురు హీరోయిన్లు ఉంటారు. వాళ్లలో అనుపమ పరమేశ్వరన్‌ది కీలక పాత్ర. ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ముందే.. చిత్రోత్సవాలకు పంపాలని డిసైడ్ అయ్యాడు వర్మ. అక్కడ కొన్ని పురస్కారాలు సాధించిన తరవాత, ఈ సినిమాని విడుదల చేయాలన్నది ప్లాన్. అతి త్వరలో ఈ ‘ఆక్టోపస్’ గురించి వివరాలు బయటకు వస్తాయి. అప్పటి వరకూ వెయిట్ అండ్ సీ.