‘హనుమాన్’ కనీ విని ఎరుగని విజయాన్ని అందుకొంది. ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇప్పుడు అందరి దృష్టీ ‘జై హనుమాన్’పైనే. ‘హనుమాన్’ కంటే.. పదింతలు క్రేజీగా, భారీగా ‘జై హనుమాన్’ తీయాలని ప్రశాంత్ వర్మ భావిస్తున్నాడు. ‘హనుమాన్’ నిర్మాతలతోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. అయితే ‘హనుమాన్’ తో పోలిస్తే బడ్జెట్ మరింత పెరుగబోతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని, మరో నిర్మాణ సంస్థని చేర్చుకొంటారా? లేదంటే సోలోగానే చేస్తారా? అనేది ఆసక్తి కలిగిస్తోంది. మరొకరి భాగస్వామ్యం కావాలంటే మాత్రం క్యూలో.. చాలా సంస్థలు ఉన్నాయి. ముఖ్యంగా టీ సిరీస్ నుంచి ప్రశాంత్ వర్మపై గట్టి ఒత్తిడి ఉంది. ”మా సంస్థలో సినిమా చేయండి.. ఏ హీరో కావాలంటే ఆ హీరోని తీసుకొస్తాం” అని టీ సిరీస్ సంస్థ.. బేరాలు మొలెట్టినట్టు టాక్.
మరోవైపు ‘హనుమాన్’ పాత్ర చేయడానికి చాలామంది స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ పాత్రకు ఎవరు బాగుంటారన్న విషయంలో ప్రశాంత్ వర్మ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. బాలీవుడ్ నుంచి సైతం హనుమాన్ పాత్ర పోషించడానికి కొంతమంది హీరోలు రెడీగానే ఉన్నారు. కానీ ఈ పాత్రకు తెలుగు నుంచే హీరోని ఎంచుకోవాలని మాత్రం ప్రశాంత్ వర్మ గట్టిగా ఫిక్సయ్యాడు. తెలుగు హీరోలు, తెలుగు సాంకేతిక నిపుణులతోనే బాలీవుడ్ ని మెప్పించాలని భావిస్తున్నాడు. అందులోనూ పాయింట్ ఉంది. ‘హనుమాన్’లో ఏ బాలీవుడ్ స్టార్ ఉన్నాడని, పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించింది? అందరినీ మెప్పించేలా కంటెంట్ ఉంటే సరిపోతుంది. స్టార్ బలం అక్కర్లెద్దు. ‘జై హనుమాన్’తోనూ ప్రశాంత్ వర్మ ఇదే ప్రూవ్ చేద్దామనుకొంటున్నాడు.