దర్శకుడు ప్రశాంత్ వర్మ సృజన ‘అ’ చిత్రంతో తెరపైకి వచ్చింది. కానీ ఆ సినిమా బహుళ ప్రజాదరణ పొందలేదు. కారణం… అదొక సర్రియలిస్ట్ మూవీ. ఆ జోనర్ సినిమాలు తెలుగులో రాలేదనే చెప్పాలి. సిమిమా అంటే విపరీతమైన ఇష్టం, పరిశీలన, వరల్డ్ సినిమాతో పరిచయం వున్న ప్రేక్షకులే ‘అ’సినిమాకి కనెక్ట్ అయ్యారు. తన రెండో సినిమాగా తీసిన ‘కల్కి’ కూడా మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. టేకింగ్ తప్పితే కంటెంట్ లేదనే విమర్శ వచ్చింది. అయితే ఈ రెండు సినిమాల నుంచి పాఠాలు నేర్చుకొని అందరికీ నచ్చే సినిమా తీయడంపై దృష్టి పెట్టాడు ప్రశాంత్. `జాంబీ రెడ్డి` తన లక్ష్యాన్ని కొంత వరకూ నెరవేర్చింది. ఇప్పుడు ‘హనుమాన్’ వచ్చింది. ఈ సినిమా విజయం ప్రశాంత్ వర్మకే కాదు తెలుగు సినిమాకి కూడా ప్రత్యేకం.
వీఎఫ్ఎక్స్ వర్క్ వున్న చిత్రాలు జోలికి వెళ్ళాలంటే నిర్మాతలకు భయం. రాజమౌళి లాంటి దర్శకులతో తప్ప మరో డైరెక్టర్ తో సాహసం చేయలేని పరిస్థితి. కానీ ప్రశాంత్ వర్మ ఈ విషయంలో తన ప్రతిభ చూపాడు. రూ.27 కోట్లు బడ్జెట్ తో వంద కోట్ల ఎఫెక్ట్ ఎలా తీసుకురావచ్చో చూపించాడు. చాలా క్యాలిటీ అవుట్ పుట్ ఇచ్చాడు. పెద్ద స్టార్స్ తోనే వీఎఫ్ఎక్స్ తో ముడిపడిన కథలు వర్క్ అవుట్ అవుతానే ఒక అభిప్రాయం వుంది. హనుమాన్ తో అది అపోహ మాత్రమే అని నిరూపించాడు.
హనుమాన్ లో భూతద్దం పెట్టుకొని వెదికినా ఒక్క స్టార్ యాక్టర్ కనిపించడు. సినిమా ముహూర్తం నాడే పోస్టర్ పై పాన్ ఇండియా టైటిల్ వేసి వదలడం ట్రెండ్ ఇప్పుడు. అంతేకాదు.. పాన్ ఇండియా అంటూ భాషకో స్టార్ నటుడుని తీసుకురావడం ఆనవాయితీ. కానీ వీటికి జోలికి పోలేదు ప్రశాంత్. తెలుగు సినిమాని తెలుగు సినిమాలానే చేశాడు. సినిమాకి హైప్ క్రియేట్ అయిన తర్వాతే మిగతా భాషలుపై ద్రుష్టి పెట్టి ఇంకా లార్జర్ గా ప్రాజెక్ట్ ని డిజైన్ చేశాడు.
సోషియో ఫాంటసీ కథలతో మెప్పించడం అంత సులువైన విషయం కాదు. పెద్ద ప్రొడక్షన్ హౌస్ అండ వుంటేగానీ ఇది సాధ్యపడదు. కానీ ప్రశాంత్ వర్మ తన దగ్గర వున్న పరిమిత వనరులతోనే పెద్ద కల కన్నాడు. ఆ కలని సాకారం చేసుకున్నాడు. రామాయణం లాంటి దృశ్యకావ్యాల నేపథ్యంలోని పాత్రల స్ఫూర్తిగా కథ రాసుకుంటే వాటిని తెరపై కన్విన్స్ చేసేలా చెప్పడం కూడా ఒక సవాలే. సబ్జెక్ట్ తేడా కొట్టనా, ప్రజెంటేషన్ సంతృప్తిని ఇవ్వకపోయినా ప్రేక్షకులని నుంచి దారుణంగా ట్రోల్స్ వస్తాయి. ఆదిపురుష్ విషయంలో ఎంత ట్రోలింగ్ జరిగిందో తెలిసిందే. వర్మ మాత్రం పకడ్బందీగా ప్లాన్ చేశాడు. ఎక్కడా విమర్శలకు తావులేకుండా చుసుకున్నాడు.
ఒక ఫిలిం మేకర్ కి క్రియేటివిటీతో పాటు గట్స్ కూడా వుండాలి. హనుమాన్ విడుదల సమయంలో ప్రశాంత్ వర్మ గట్స్ ని మెచ్చుకోవాల్సిందే. నాలుగు పెద్ద సినిమాలు బరిలో నిలిచాయి. అందులో అందరూ పరిశ్రమకు మూలస్తంభాలు లాంటి హీరోలే. ఆ కోణంలో కాస్త లౌక్యం పాటిస్తూ.. మొహమాటానికైనా తన సినిమా విడుదల వాయిదా వేస్తాడని చాలా మంది అనుకున్నారు. ఒక వారం ముందుకు వెనక్కి జరుగుతాడేమోనని భావించారు. కానీ ఎక్కడా తగ్గలేదు వర్మ. ఇది అహంకారం కాదు.. తన కంటెంట్ పై నమ్మకమని ప్రేక్షకుల చేత అనిపించుకోగలిగాడు.
సినిమా బాగా తీస్తే సరిపోదు.. దాన్ని సరిగ్గా ప్రమోట్ చేయాలి. ఈ విషయంలో రాజమౌళి అడుగుజాడల్లో నడిచాడు వర్మ. గ్రాఫిక్స్ పనులు జరుగుతున్న సమయంలో తనకి కావాల్సిన టైం దొరికింది. ఈ సమయంలో ప్రమోషనల్ కంటెంట్ ని ప్లాన్ చేసుకున్నాడు. ప్రచారంలో కూడా తన మార్క్ చూపించాడు. తెలుగుతో పాటు హిందీపై దృష్టి పెట్టాడు. అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళకి ముందుగానే సినిమా చూపించాడు. తరణ్ ఆదర్శ్ లాంటి వాళ్లు ఈ సినిమాపై పాజిటీవ్ గా స్పందించారు. హిందీలో హనుమాన్ కి దాదాపుగా నాలుగు స్టార్లు పడ్డాయి. దీనికి కంటెంట్ ఒక కారణం అయితే ప్రశాంత్ వర్మ తీసుకున్న చొరవ మరో కారణం. హిందీలో పూర్తిగా పాజిటివ్ టాక్ రావడంతో, తెలుగు ప్రిమియర్లకు వెళ్లిన ప్రేక్షకులు కూడా అంతే సానుకూల దృక్పథంతో సినిమాని చూడగలిగేలా చూసి.. పూర్తిగా పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేయడంలో ప్రశాంత్ వర్మ ముందుచూపు బాగా పని చేసింది.
ప్రశాంత్ వర్మ ప్లానింగ్స్ భారీగా వున్నాయి. ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ లో కొన్ని సినిమాలు చేయాలని కొన్నాళ్ళుగా వర్క్ చేస్తున్నాడు. ఇపుడు హనుమాన్ విజయం ఆయనకి మంచి జోష్ ఇచ్చింది. హనుమాన్ సక్సెస్ తో వర్మ వర్త్ అర్ధమైయింది. ఆయనకు కావాల్సిన బడ్జెట్ ఇబ్వ్వడానికి నిర్మాతలు ఆసక్తిని చూపిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. హనుమాన్ రావడానికి చాలా సమయం పట్టింది. కారణం.. పరిమిత వనరులు. ఇప్పుడు తన చేయబోయే సినిమాలకు వనరులు కొరత ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వర్మ వర్త్ అందరికీ తెలిసింది.