నిర్మాతల తనయులు వెండి తెరపై హీరోలుగా మెరవడం, ఆ తరవాత.. స్టార్లుగా మారడం తెలుగు చిత్రసీమలో మామూలే. ఇప్పుడు మరో నిర్మాత వారసుడు హీరోగా కెమెరా ముందుకు రానున్నాడు. తనే కల్యాణ్. టాలీవుడ్ లో భారీ చిత్రాలకు పేరు గాంచిన డి.వి.వి. దానయ్య తనయుడు కల్యాణ్. తను త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రానికి ‘అధీర’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం.
‘అ’, ‘కల్కి’, ‘జాంబిరెడ్డి’ చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు `హనుమాన్` అనే సోషియో ఫాంటసీ సినిమా తీస్తున్నాడు. తన తదుపరి ప్రాజెక్టు `అధీర`నే. ఇటీవలే.. దానయ్యకు కథ మొత్తం చెప్పేశాడు ప్రశాంత్ వర్మ. సింగిల్ సిట్టింగ్లో ఈ కథ ఓకే అయినట్టు సమాచారం. ఈవారంలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుంది.