నందమూరి బాలకృష్ణ దగ్గర ‘ఆదిత్య 999’ కథ సిద్ధంగా ఉంది. అప్పట్లో బాలయ్య వందో సినిమాగా దీన్నే తీద్దామనుకొన్నారు. ఓ దశలో తనే దర్శకత్వం వహించాలని అనుకొన్నారు. సింగీతం శ్రీనివాసరావుతో డైరెక్ట్ చేయిద్దామని ప్లాన్ చేశారు. అయితే ఇవేం కుదర్లేదు. తరవాత.. కొత్త కథలు, కొత్త దర్శకులు బాలయ్యని వెదుక్కొంటూ రావడంతో ఆ స్క్రిప్టు పక్కన పెట్టేశారు. అయితే ఎప్పటికైనా ఆ కథ తీయాలన్నది బాలయ్య ఆశ, ఆకాంక్ష. కానీ సరైన దర్శకుడే కావాలి. అలాంటి మంచి ఆప్షన్ ఇప్పుడు బాలయ్య కళ్ల ముందే ఉంది.
ఈ కథని టేకప్ చేయగల సత్తా… ప్రశాంత్ వర్మకి ఉందన్నది అందరి నమ్మకం. జాంబీ రెడ్డి, హనుమాన్ లతో తన సత్తా చాటుకొన్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ అవుట్ పుట్ ఇవ్వగలడంలో సమర్థుడు. ‘ఆదిత్య 999’ లాంటి సైన్స్ ఫిక్షన్ ని తెరకెక్కించాలంటే దర్శకుడికి విజువల్ సెన్స్ చాలా అవసరం. అది ప్రశాంత్ వర్మలో కావల్సినంత ఉంది. పైగా బాలయ్యతో ఓ సినిమా చేయాలని ప్రశాంత్ వర్మ ఉవ్వీళ్లూరుతున్నాడు. బాలయ్యతో పలుమార్లు భేటీ కూడా వేశాడు. కాకపోతే.. బాలయ్య కోసం తన సొంత కథ ఒకటి రెడీ చేశాడు. ‘ఆదిత్య 999’ కథనే ప్రశాంత్ వర్మతో చేయిస్తే బాగుంటుందని, ఓవైపు బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ తెరపైకి రావడంతో పాటు, ప్రశాంత్ వర్మకు బాలయ్యతో పని చేసినట్టూ ఉంటుందని బాలయ్యకు సన్నిహితులు సలహా ఇస్తున్నార్ట. ప్రశాంత్ వర్మకు కూడా ఇలాంటి కథలంటే ఇష్టం కాబట్టి… ‘నో’ చెప్పే అవకాశం చాలా తక్కువ. మరి… ఏం జరుగుతుందో చూడాలి.