ఈ సంక్రాంతికి రాబోతున్న సినిమాల్లో `హనుమాన్` ఒకటి. అయితే.. ఈ సినిమా విడుదలని ఆపడానికి చాలా రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆఖరికి దిల్ రాజు కూడా ‘మీ సినిమా వాయిదా వేసుకొంటే మంచిది’ అని దర్శక నిర్మాతలకు తన వంతుగా సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయనే ఓ ప్రెస్ మీట్లో ఒప్పుకొన్నారు కూడా. ఒకవేళ సినిమా వాయిదా వేసుకొంటే సోలో రిలీజ్ డేట్ ఇస్తామని కూడా ఆఫర్ ఇచ్చారు. ‘హనుమాన్’ విడుదల తేదీ ఎప్పుడో జులైలో ఫిక్సయ్యింది. ‘ఈగల్’, ‘నా సామి రంగ’ టేటుగా సంక్రాంతి డేటుని ప్రకటించుకొన్నాయి. ఇవి రెండూ పెద్ద హీరోల సినిమాలు కాబట్టి, వాటిని ఏం చేయలేరు కాబట్టి… ‘హనుమాన్’పై పడ్డారంతా. ‘గుంటూరు కారం’, ‘సైంధవ్’ చిత్రాల్ని దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు. అందుకే ఆ సినిమాల జోలికి వెళ్లరు.
ఎటు చూసినా ‘హనుమాన్’కు ఇది జటిలమైన సమస్యే. పోటీ పడి సంక్రాంతి బరిలో నిలిస్తే… ఇక్కడ థియేటర్లు దక్కవు. పైగా.. పెద్దల్ని ఎదిరించినందుకు ఎదురయ్యే పరిణామాల్ని కాపుకాయాల్సివుంటుంది. మరోవైపు సంక్రాంతి మంచి సీజన్. ఈ సీజన్లో విడుదలై మంచి టాక్ సంపాదిస్తే వసూళ్లకు కొదవ ఉండదు. పైగా హనుమాన్‌కి నార్త్ లో మంచి గిరాకీ వచ్చింది. అక్కడ మంచి రేట్లకు ఈ సినిమా అమ్ముడుపోయింది. నార్త్ లో సినిమాని కొన్నవాళ్లు భారీ ఎత్తున ప్రమోషన్స్ చేయడానికి సిద్ధమయ్యారు. దాదాపుగా1500 థియేటర్లలో ఈ సినిమాని విడుదల చేయడానికి అక్కడ రెడీ అవుతున్నారు. వివిధ ప్రాంతాల్లో 150 కటౌట్లు (ఒకొక్కటీ 35 అడుగులు) ప్రతిష్టించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాని వాయిదా వేయాలంటే ముందు నార్త్ డిస్టిబ్యూటర్లని ఒప్పించాలి. అయితే నార్త్‌లో ధియేటర్లు దొరికితే సరిపోదు. తెలుగునాట ఎన్ని థియేటర్లు ఉన్నాయన్నది ముఖ్యం. కనీస సంఖ్యలో థియేటర్లు దొరికితే.. సినిమాని విడుదల చేయడానికి ఎలాంటి సమస్య ఉండదు. వీలైనంత వరకూ జనవరి 12ని వదులుకోకూడదని చిత్రబృందం ఫిక్సయినట్టు తెలుస్తోంది. మరీ కక్ష కట్టి థియేటర్లు రాకుండా చేస్తే తప్ప.. హనుమాన్ విడుదలకు అడ్డు లేనట్టే. ఇన్ని కష్టాలు పడి ఈ పోటీ ఎందుకంటే.. జనవరి 26 వరకూ ఆగాలి.