ఆంధ్రప్రదేశ్ డీజీపీని టార్గెట్ చేసుకుని.. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్ ఇప్పుడు… సివిల్ సర్వీస్ అధికారుల ఇళ్లకు ఎసరు తెచ్చి పెట్టింది. ప్రశాసన్ నగర్లో అఖిల భారత సర్వీసు అధికారుల ఇళ్లు.. అక్రమంగా నిర్మించారని.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని.. పార్కు స్థలాలను కబ్జా చేశారని.. అక్యుపెన్సీ సర్టిఫికెట్ల లాంటివి లేకుండా కమర్షియల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ.. ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఒక్క ఆర్పీ ఠాకూర్‌నే టార్గెట్ చేసుకుంటే.. కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుందని అనుకున్నారేమో కానీ… ఆళ్ల మొత్తం… ప్రశాసన్ నగర్‌ను టార్గెట్ చేశారు. జిహెచ్ఎంసి రిపోర్ట్ ప్రకారం 30 ఇల్లు అక్రమంగా కమర్షియల్ గా ఉపయోగిస్తున్నారని, ?22 భవనాల్లో అనుమతి లేకుండా అదనపు అంతస్తులు నిర్మించారని, 20 మంది అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లు లేకుండా ఉన్నారని, 48 నివాసాలు ప్రభుత్వ పార్కు స్థలాన్ని కబ్జా చేశారని.. పిటిషన్ వేసారు.
దీనిపై హైకోర్టు…స్పందించింది. అక్రమ నిర్మాణాలు కట్టే వరకూ ఏం చేస్తారని.. జీహెచ్ఎంసీపై మండి పడి.. ఉన్న పళంగా… అక్రమ నిర్మాణాలను కూలగొట్టాలని ఆదేశించింది. నిజానికి ఈ పిటిషన్‌ను ఆళ్ల.. ఒక్క ఏపీ డీజీపీనే టార్గెట్ చేశారు. ఆయనకు ఉన్న ఇంటికి సంబంధించి..మెట్లు పక్కనే ఉన్న పార్క్ స్థలంలో కట్టారని ఆయన ఆరోపించారు. హైకోర్టు తీర్పుతో.. ఆ మెట్లను.. గోడను… జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. కానీ ఇది ఇంతటితో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ప్రశాసన్‌నగర్‌లో ఉన్న అన్ని ఇళ్లకూ.. హైకోర్టు తీర్పు పోటు తగలడం ఖాయమే. ఒక్క ఆర్పీ ఠాకూర్ ఇంటిపైనే కోర్టు రూలింగ్ ఇచ్చినట్లు మీడియాలో ప్రచారం జరుగుతున్నా.. అసలు వాస్తవం మాత్రం.. మొత్తం ప్రశాసన్ నగర్ చుట్టూ కనిపిస్తోంది.
ప్రశాసన్ నగర్ అనేది.. చాలా ఏళ్ల క్రితం.. సివిల్ సర్వీస్ అధికారులకు ప్రభుత్వం స్థలాలు కేటాయించిన ప్రాంతం. తెలుగు రాష్ట్రాల్లో పని చేసే… సీనియర్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులందరికీ అక్కడ ఇళ్లు ఉన్నాయి. అయితే.. చాలా వరకు.. వాటిలో నివాసం ఉండరు. అద్దెలకు ఇవ్వడమో… ఇతర కార్యక్రమాలకు వాడుకోవడమో చేస్తున్నారు. దీని కోసం అవసరమైన మార్పులు చేసుకున్నారు. ఆ ఇళ్లన్నీ ప్రభుత్వాల్లో కీలక స్థానాల్లో ఉండే అధికారులవే కావడంతో.. పర్మిషన్లు అడగడం.. తీసుకోవడం అనే మాటే ఉండదు. అందుకే..అక్కడ ఉన్న భవన నిర్మాణాల్లో ఒక్కటీ ప్లాన్ ప్రకారం ఉండదని చెబుతూంటారు. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి.. అక్కడ ఇళ్లు ఉన్న అధికారులందరికీ టెన్షన్ పుట్టిస్తున్నారు. ఈ వ్యవహారం ఆళ్ల వర్సెస్ ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల వ్యవహారంగా మారే అవకాశం కనిపిస్తోంది.