అనగనగా ఓ ఊర్లో.. ఓ పెద్దాయన. కొడుకులిద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. సడన్‌గా ఈ పెద్దాయనకు కాన్సర్ అని తెలిసింది. ఐదు వారాలకంటే ఎక్కువ బతకలేడు. ఈలోపు ఏదైనా జరగొచ్చు. అందుకే కొడుకుల్ని చూడాలనుకున్నాడు. వాళ్లవేమో పెద్ద పెద్ద ఉద్యోగాలాయె. వాటిని వదిలి ఐదు వారాల పాటు పల్లెటూర్లో ఉండలేరు. ఆయన ఇంకా చావకుండానే కర్మకాండలు ఎవరు చేయాలి? అనే విషయంలో కొడుకులిద్దరూ తర్జన భర్జనలు పడుతుంటే.. సడన్‌గా మనవడు ఊడి పడ్డాడు. తాతయ్యకు నేనున్నా అనే భరోసా ఇచ్చాడు. తాతయ్యకు తీరని కోరికలన్నీ తీర్చేసే పోగ్రాం పెట్టుకున్నాడు. ఆ తరవాత కొడుకులూ దిగివచ్చారు. ఆ తరవాత.. ఏమైంది? ఆ పెద్దాయన్ని ఎలా సాగనంపారు? అనేదే `ప్రతిరోజూ పండగే` కథ.
మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబరు 20న రాబోతోంది. సాయిధరమ్ తేజ్ – రాశీఖన్నా జంటగా నటించారు. సత్యరాజ్, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. ట్రైలర్ విడుదలైంది. పైన చెప్పుకున్న కథ మొత్తం ట్రైలర్లో రివీల్ చేసేశారు. ఓ ఎమోషనల్ బ్యాంగ్‌తో ట్రైలర్ మొదలైంది. ‘మారే కాలంతో పాటు మనం కూడా మారాలి. వయసుతో పాటు ఆశలు కూడా చచ్చిపోవాలి’ అనే డైలాగ్ తో ఓ తాతయ్యలోని మనోవేదన అద్దం పట్టారు. అక్కడి నుంచి ఫన్ రైడ్ మొదలైపోయింది. మారుతి సినిమా అంటే.. వినోదానికి ఢోకా ఉండదు. ఈ సినిమాలోనూ కావల్సినంత ఫన్ ఉందన్న విషయం ట్రైలర్లోనే అర్థమైంది. హీరోయిన్ క్యారెక్టర్ని వినూత్నంగా తీర్చిదిద్దారు. రాజమండ్రిలో టిక్ టాక్‌లు చేసుకుంటూ, సెలబ్రెటీ అయిపోవాలని కలలు కనే అమ్మాయిగా రాశీఖన్నా పాత్ర ఉండబోతోంది. ఈ కథలో, పాత్రల ప్రవర్తనలో ‘శతమానం భవతి’ ఛాయలు కనిపిస్తాయి. అందుకేనేమో.. చివర్లో రావు రమేష్ డైలాగుల్లో శతమానం భవతిని గుర్తుకు చేశారు.
మొత్తానికి ఇదో భావోద్వేగభరితమైన కథ. దాన్ని వీలైనంత వరకూ వినోదాత్మకంగా తీర్చే ప్రయత్నం చేశాడు. పల్లెటూరి అందాల మధ్య, భారీ తారాగణం మధ్య తెరంతా నిండుగా కనిపిస్తోంది. కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.